
హైదరాబాద్: నారాయణ సంస్థలపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నారాయణ కేంద్ర కార్యాలయ ఉద్యోగి సునీత కొట్టిపారేశారు. నారాయణలో మహిళలకు రక్షణ లేదంటూ మాజీ ఉద్యోగిని శిరీష చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ నారాయణ సంస్థలో 26 వేల మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. మహిళల ప్రోత్సాహానికి నారాయణ సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల్లో పనిచేస్తున్న శిరీష ఆ సంస్థ ప్రలోభాలకు లోనై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దశాబ్దాలుగా నారాయణలో ఉద్యోగులుగా కొనసాగుతున్న వారు అనేక మంది ఉన్నారని గుర్తు చేశారు. శిరీష చేసిన ఆరోపణల వెనుక శ్రీ చైతన్య హస్తం ఉందని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం మ హిళలను కించపరిచేలా ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. అసలు శ్రీలత మరణం వెనుక నారాయణ ఉద్యోగుల హస్తం ఉందనటం భావ్యం కాదన్నారు. మహిళా ఉద్యోగి ప్రమీల రాణీ మాట్లాడుతూ ఆడియో టేపులను సమర్థిస్తూ శిరీష చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ఆడియో టేపుల వెనుకున్న నిజాలను విచారిస్తున్నామని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.