ఏటీఅగ్రహారం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం నిషేధించిన అన్ని రకాల పొగాకు ఉత్పత్తులను, ఆహార పదార్థాలతో మిశ్రమమైన పొగాకు ఉత్పత్తులను జిల్లాలో విక్రయిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జోన్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రభుత్వం మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సోమవారం ఆయన న్యూస్‌లైన్‌కు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల(సిగరెట్లు, బీడీలు మినహా) విక్రయాలతోపాటు కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా తనకు (సెల్: 9440379755) తెలియజేయాలని కోరారు.
గుట్కా, పాన్‌పరాగ్, మరికొన్ని పొగాకు ఉత్పత్తులపై నిషేధం గడువు ఈనెల 9వ తేదీతో ముగియడంతో నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఈనెల 10న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు న్యూస్‌లైన్‌కు వెల్లడించారు.
నిషేధిత ఉత్పత్తులు ఇవే..పొగాకుతో కలిసి ఉన్న పాన్ మసాలా, గుట్కా, చూయింగ్ టుబాకో, చాప్ టుబాకో, ప్యూర్ టుబాకో, ఖైనీ, కారా, సెంటెడ్ టుబాకో, ఫ్లేవర్ టుబాకోలను ప్రభుత్వం నిషేధించింది.
నిషేధించిన పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే సెక్షన్-58 ప్రకారం స్టాక్‌ను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తారు. మొదటిసారి పట్టుబడిన వ్యక్తులపై రూ.2 లక్షలు జరిమానా, రెండవ విడత అదే వ్యక్తి పట్టుబడితే రూ. 4 లక్షలు జరిమానా విధిస్తారు. మూడవ సారి పట్టుబడితే సదరు వ్యాపారి లెసైన్సును పూర్తిగా రద్దు చేస్తారు. హానికరమైన ఉత్పత్తులు అని పరీక్షల్లో తేలితే రూ.10 లక్షల జరిమానాతోపాటు జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంది.
వ్యాపార లెసైన్సులు పొందాలి.. జిల్లాలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులందరూ తప్పనిసరిగా ప్రతిఏటా లెసైన్సులు పొందాలి. వచ్చేనెల 4వ తేదీలోగా లెసైన్సు పొందకుంటే, తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేస్తామని పూర్ణచంద్రరావు తెలిపారు. వీరికి కోర్టులో రూ. 5 లక్షల జరిమానాతోపాటు, ఆరు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు
Published Tue, Jan 14 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement