తిరుమలలో నీటి సమస్య తీవ్రతరం!
తిరుమల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సకాలంలో వర్షాలు కురవకపోవడం, బోర్లు ఎండిపోవడంతో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. తాజా నీటి సమస్య ఆలయ అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి రోజు సుమారు 70 వేలకు పైగా భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని.. వారి అవసరాలకు దాదాపు 40 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుందని అధికారులు తెలిపారు. పాపనాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ లో నీటి నిలువల స్థాయి పడిపోవడంతో అధికారులకు దిక్కు తోచని పరిస్థితిలో పడ్డారు.
అధికారుల సమాచారం ప్రకారం పాపనాశనంలో 412 లక్షల గ్యాలన్లు, గోగర్భం డ్యామ్ లో 55 లక్షలు, కుమారధార డ్యామ్ లో 1075 గ్యాలన్లు, పసుపుధార డ్యామ్ లో 32 లక్షల గ్యాలన్లు మేరకు నీటి నిల్వలున్నాయని.. మొత్తం 1574 లక్షల గ్యాలన్ల నీరు రిజర్వాయర్లలో అందుబాటులో ఉందని.. ఒకవేళ వర్షాలు కురవకపోతే.. మరో 48 రోజులపాటు నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.