తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ రోడ్ల ప్రయాణంలో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరు సుందర తిరుమల-శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి. 'ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం.
తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు. టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈవో ఎవి ధర్మారెడ్డి తెలిపారు.
'తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాము. టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్, పోలీస్, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి.రమణగారు సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు' అని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:అధైర్యపడొద్దు..అండగా ఉంటాం
'తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశాము. ట్యాక్సీ డ్రైవర్లు, వాహనదార్లు డ్రైవింగ్ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్ టేక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి' అని ఈవో ధర్మారెడ్డి కోరారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించింది. ఈ భూమిలో దాత, రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించనున్నారు. జూన్ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మే 31వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది.
ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జమ్మూలోని మజీన్ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 3 నుండి 8వ తేదీ వరకు టీటీడీ నిర్వహిస్తోంది. 8వ తేదీ జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండి:శరవేగంగా చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం
శ్రీ పద్మావతి హృదయాలయంలో 20నెలల వ్యవధిలోనే 1450 మంది చిన్నారులకు ఉచితంగా గుండె అపరేషన్లు నిర్వహించారు . క్లిష్టమైన గుండె అపరేషన్లు కూడా ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్ భారత్ స్కీంల కింద, ప్రాణదానం ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మూడు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహించినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 'టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోస పోవద్దు' అని ఈవో ధర్మారెడ్డి భక్తులను కోరారు.
మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.38 లక్షలుకాగా, హుండీ కానుకలు రూ.109.99 కోట్లు ఆదాయం లభించింది. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ఒక కోటి 6 లక్షలు కాగా, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 56.30 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11 లక్షలు.
ఇదీ చదవండి:మేనిఫెస్టో చంద్రబాబు దృష్టిలో ప్రజలను నమ్మించే కాగితం: కొమ్మినేని
Comments
Please login to add a commentAdd a comment