రాంబాబు రుబాబేంది!
సీనియర్ అసిస్టెంట్ రాంబాబు సస్పెన్షన్
కర్నూలు(అగ్రికల్చర్): పత్తికొండ ఏడీఏ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ విజయమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ మృతిపై ఆదోని ఆర్‌డీఓను విచారణ అధికారిగా నియమించారు.
పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో ఏడాది నుంచి ఏమి జరుగుతుందనే అంశంపై కూడా విచారణ జరపాలని ఏజేసీ అశోక్‌కుమార్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌ను ఆదేశించారు. విచారణ రిపోర్టులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటారు. మురళీధర్ అంత్యక్రియల నిర్వహణకు రూ.10వేలు అందజేశారు. జాతీయ ఆహారభద్రత మిషన్ ఇంట్రెస్ట్ అమౌంట్ నుంచి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. శనివారంలోగా వ్యవసాయాధికారులకు పెండింగ్ జీతాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జేడీఏ ఠాగూర్‌నాయక్ హామీ ఇచ్చారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఆ కార్యాలయంలో ఆయనదే పెత్తనం. సార్ తలుచుకుంటే ఏ పనైనా జరిగిపోవాల్సిందే. పైస్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరు సీనియర్ అసిస్టెంట్‌కు లోకువే. తన మాట వినలేదని ఏకంగా 20 మంది ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు అందకుండా అడ్డుకున్న ఘనుడు ఆ పెద్ద మనిషి. పత్తికొండ ఏడీఏ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాంబాబు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. అక్కడ తాను చెప్పిందే వేదం అన్నట్లు మోనార్క్‌లా వ్యవహరిస్తున్నాడు.ఆయన వేధింపులు తాళలేక సోమవారం కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ కర్నూలు కలెక్టలేట్ కార్యాలయ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆరు నెలలుగా సిబ్బందికి అందని వేతనాలు..
పత్తికొండ డివిజన్ వ్యవసాయ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాంబాబు తీరుతో డివిజన్‌లో పనిచేస్తున్న 20 ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు జీతాలు రావడం పది రోజులు ఆలస్యమైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాంటిది నెలలు తరబడి వేతనాలు అందకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరమే. జీతాలు లేకపోగా పెపైచ్చు వేధింపులు కూడా అధికం కావడంతో భరించలేకనే జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆయన కారణంగా నలుగురు వ్యవసాయాధికారులు, 12 మంది ఏఈ ఓలు, ఇద్దరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఒక అటెండర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2013 నవంబర్‌లో రుక్సానా అనే మహిళ ఏఈఓగా ఉద్యోగంలో చేరింది. ఆమెకు ఇంతవరకు జీతాలు లేవు. జిలానీ బాషా అనే ఏఈఓ గతేడాది జూన్‌లో బదిలీపై పత్తికొండకు వెళ్లాడు. ఈయనకు పది నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. అటెండర్‌కు ఏడు నెలలుగా జీతా లు లేవు. ఉద్యోగుల సర్వీస్ రిజిష్టర్లు ఇతర కీలకమైన రికార్డులు తన కంట్రోల్‌లో పెట్టుకునేవారు.
ఏడీఏ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని రాంబాబు..
నాలుగు నెలల క్రితం పత్తికొండ ఏడీఏగా పని చేసిన నారాయణ నాయక్‌ను సరెండర్ చేసిన తర్వాత దేవనకొండ ఏఓ శేషాద్రికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే సీనియర్ అసిస్టెంటు రాంబాబు శేషాద్రికి ఇంతవరకు చార్జ్ ఇవ్వలేదు. ఆయనతీరుతో మనస్తాపానికి గురైన శేషాద్రి పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు నాలుగు నెలల క్రితం సీనియర్ అసిస్టెంట్ రాంబాబును సస్పెండ్ చేయాలని జేడీఏ వ్యవసాయ శాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినా ఫలితం లేదు.
జూనియర్ అసిస్టెంట్ మరణం కలచివేసింది: శేషాద్రి, ఇన్‌చార్జ్ ఏడీఏ
కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మురళీధర్ అకాల మరణం కలచి వేసింది. నాలుగు నెలల క్రితం నాకు ఇన్‌చార్జ్ ఏడీఏగా బాధ్యతలు ఇచ్చారు. అయితే సీనియర్ అసిస్టెంట్ రాంబాబు చార్జ్ ఇవ్వలేదు. నువ్వు వ్యవసాయ అధికారివి మాత్రమే... నీకు ఎలా ఏడీఏ బాధ్యతలు ఇస్తారంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. చార్జీ ఇవ్వనందుకే పత్తికొండకు వెళ్లి విధులు నిర్వహించడం లేదు. నాకు కూడా ఆరు నెలలుగా జీతాలు లేవు.