
అడారు వద్ద 2005లో నిర్మించిన అడారు ఆనకట్ట
అడారు గెడ్డ ఆనకట్ట... నిర్మాణం ప్రారంభించి సరిగ్గా 13 ఏళ్లవుతోంది. పనులు రెండేళ్లలో పూర్తి చేశారు. ఆనకట్ట సిద్ధం కావడంతో సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు సంబరపడ్డారు. తిండిగింజలకు లోటుండదని, స్వేదం చిందించి బంగారు పంటలు పండించుకోవచ్చని ఆశపడ్డారు. ఆనకట్ట నిర్మాణం పూర్తయిన కొద్దినెలలకే అప్ప టి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అకాల మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. కాలువల నిర్మాణంలో జాప్యం రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టు ఉన్నా నీరందని పరిస్థితి. వర్షాధారంపైనే పంటలు సాగుచేసుకోవాల్సిన దుస్థితి. ప్రాజెక్టు తీరును ఓ సారి పరిశీలిస్తే...
విజయనగరం, పార్వతీపురం: పార్వతీపురం మండలం అడారు గ్రామం వద్ద 2005 డిసెంబర్ 30న అడారు గెడ్డపై ఆనకట్ట పనులు ప్రారంభించారు. రూ.4.15 కోట్లతో ప్రతిపాదనలు పంపగా అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నిధులు మంజూరు చేశారు. రెండేళ్లలో ఆనకట్ట పనులను పూర్తి చేశారు. పార్వతీపురం మండలంలోని తాడంగి వలస, డీకేపట్నం గ్రామాలు, మక్కువ మండలం అనసభద్ర గ్రామం వరకు మొత్తం ఏడు కిలోమీటర్ల పొడవున కాలువ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో భాగంగా అవసరమైన 47.75 ఎకరాల భూమిని సమీకరించారు. ఇంతలో మహానేత మరణంతో భూ లబ్ధిదారులకు చెల్లింపులు నిలిచిపోయాయి.
రూ.17కోట్లకు పెరిగిన అంచనా విలువలు..
2010లో గుత్తేదారు తప్పుకోవడంతో అప్పటి నుంచి అడారు ఆనకట్ట నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం వాటి అంచనా విలువలు భారీగా పెరిగిపోయాయి. 2016–17 సంవత్సరంలో రూ.13కోట్లు అంచనా విలువతో ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం 2018–19 ఎస్‌ఎస్‌ఆర్‌ఆర్ ప్రకారం జీఎస్టీతో కలిపి రూ.17 కోట్లకు అంచనా విలువలు పెరిగిపోయాయి. ఈ నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
ఆనకట్ట పూర్తయితే 600 ఎకరాలకు సాగునీరు
అడారు ఆనకట్ట పూర్తయితే ఇటు పార్వతీపురం, అటు మక్కువ మండలాల్లో 600 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. మక్కువ మండలం అనసభద్ర గ్రామ పరిధిలో 424 ఎకరాలకు, పార్వతీపురం మండలం డీకే పట్నం, తాడంగి వలస గ్రామాలకు 236 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రధాన కాలువ అనుసంధానం చేసుకుంటే మండలంలోని జమదాల, తాళ్లబురిడి, డీకే పట్నం, ములగ గ్రామాల్లోని మరో 300 ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంది. కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆనకట్ట నీరు వృథాగా పోతోంది. రైతులకు సాగునీటి కష్టాలు షరామామూలయ్యాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి బతికి ఉంటే కాలువల నిర్మాణం పూర్తయ్యేదని, సాగునీటి వెతలు తీరేవని రైతులు చెబుతున్నారు. రైతులను ఆదుకునే ప్రభుత్వం రావాలని ఆశపడుతున్నారు.
కళ్లముందే నీరు వృథా..
మా కళ్లముందే అడారు గెడ్డనీరు వృథా అవుతోంది. ఆనకట్ట నిర్మాణం పూర్తయినా ఫలితం లేకపోతోంది. కాలువల నిర్మాణంపై పాలకులు పట్టించుకోవడం లేదు. రైతుల భూములకు పరిహారం చెల్లించలేదు. ఇప్పుడు కాలువల నిర్మాణం పనుల అంచనా విలువలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నీటి వనరులు ఉన్న చోట ఆనకట్టు కట్టి రైతాంగానికి సాగు నీరు అందిస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి. – చొక్కాపు వీరయ్య, డోకిశిల
కాలువలు నిర్మిస్తే ఏడాదికి మూడుపంటలు..
అంతా మెట్ట, పల్లం భూములు. వర్షాధారంపైనే పంటలు సాగుచేస్తున్నాం. కాలువల నిర్మాణం పూర్తయితే ఆరువందల ఎకరాల్లో మూడుపంటలు పండించేందుకు అవకాశం ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరో 300 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చిన్న చిన్న సమ్యలను పరిష్కరించడంలో ఈ ప్రాంత పాలకులు, అధికారులు శ్రద్ధ చూపించకపోవడం వల్లే అడారు ఆనకట్ట ఫలాలు రైతులకు అందడంలేదు. ఏటా సాగునీటి కష్టాలు తప్పడంలేదు. – సీహెచ్ సాయిబాబ, డీకే పట్నం, రైతు
ప్రతిపాదనలు పంపించాం
అడారు ఆనకట్ట కాలువల పనులు పూర్తి చేసేందుకు, భూ సమీకరణలో భాగంగా రైతులకు చెల్లింపులు జరిపేందుకు అవసరమైన నిధుల కోసం కొత్తగా ప్రతిపాదనలు పంపించాం. ట్రైబల్ సబ్‌ప్లాన్ నిధులు త్వరలో మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు మంజూరైన వెంటనే టెండర్ పిలిచి డిసెంబర్‌లో పనులు ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నాం.– రఘు, ఇరిగేషన్ ఏఈ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment