సాక్షి, రాజమండ్రి : ‘ఎంత చెట్టుకు అంత గాలి.. ఎంత పిట్టకు అంత గూడు’ అన్నట్టు- తమకంటూ నీడనిచ్చే ఓ చిన్నఇల్లు సొంతం కాబోతోందని ఆ నిరుపేదలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా ఇల్లు సిద్ధమయ్యాక- చేతికి వచ్చిన ముద్ద తినకుండా మూతి మీద కొట్టినట్టు.. ప్రభుత్వం వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. ‘అది మోస్తేనే ఇల్లు.. లేకుంటే ఇంటికీ, మీకూ చెల్లు’ అని నిర్దాక్షిణ్యంగా అంటోంది.
పట్టణ పేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఇంటిగ్రేటెడ్ హౌసింగ్, స్లమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం(ఐహెచ్‌ఎస్‌డీపీ)కు శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో ఈ పథకం కింద పేపర్ మిల్లు సమీపంలోని ఆర్‌అండ్‌బీ స్థలంలో, ధవళేశ్వరం సమీపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద, లాలాచెరువులో 3,500కు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1,750 ఎస్సీలకు కేటాయించారు. నాలుగేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. గృహ నిర్మాణ సంస్థ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల నుంచి రూ.26,500 డీడీల రూపంలో కట్టించుకున్నారు.
పరిమాణం, కైవారం తదితర అంశాల ప్రకారం కొన్ని ఇళ్లకు ముందుగా రూ.17,000 కట్టించుకున్నారు. జి+ కేటగిరీల్లో ఇళ్లు నిర్మాణాలు చేపట్టారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఇళ్ల నిర్మాణాల్లో అధికార పార్టీ నేతలు తీవ్ర జాప్యానికి కారణం అయ్యారు. లబ్ధిదారుల జాబితాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే తనకు అనుయాయులకు ఇళ్లు కేటాయించేందుకు జాబితాలో మార్పులు చేయించాన్న ఆరోపణలు కూడా వచ్చాయి. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. లబ్ధిదారులు తమ సొంత ఇంటికల నెరవేరుతోందని సంబరపడుతున్న తరుణంలో ప్రభుత్వం వారి పాలిట పీడకల లాంటి నిర్ణయం తీసుకుంది.
ఆ అప్పులే ఇంకా తీరలేదు..
నిర్మాణ వ్యయం పెరిగినందువల్ల యూనిట్ ధర పెరిగిందని, అందువ ల్ల అదనంగా డబ్బులు కట్టాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. గతంలో రూ.26,500 కట్టిన వారు మరో రూ.15,000 తక్షణం చెల్లించాలని, రూ.17,000 చెల్లించిన వారు మరో రూ. 10,000 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ‘డిసెంబర్ నెలాఖరులోగా మిగిలిన సొమ్ములు చెల్లించకుంటే ఇళ్లు రద్దు చేసేస్తాం’ అని కూడా హెచ్చరించారు. దీంతో నిరుపేదలైన లబ్ధిదారులు ప్రధానంగా ఎస్సీ లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సొంత ఇళ్లు వస్తాయన్న ఆశతో అప్పట్లో వడ్డీలకు తెచ్చి మరీ డబ్బులు కట్టామని, ఆ అప్పులే ఇంకా తీరలేదని, ఇప్పుడు ఇంకా డబ్బులు తేవాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.
ఇళ్లు ఇవ్వకపోతే ఉద్యమమే : చోడిశెట్టి
నగరంలో ఆర్‌అండ్‌బీ స్థలంలో 696 ఇళ్లు, లాలాచెరువు వద్ద 360 ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ వారంతా అదనంగా సొమ్ము చెల్లిస్తేనే ఇళ్లు దక్కుతాయని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. కానీ తాము అంత సొమ్ములు చెల్లించుకోలేమని, తమకు నెలకు రూ.1,000 చెల్లించుకునేలా వాయిదాల పద్ధతికి అనుమతి ఇవ్వాలని 47వ డివిజన్‌కు చెందిన పేకేటి సూర్యకాంతం అనే లబ్ధిదారు అభ్యర్థిస్తున్నారు. ‘గూడు దక్కబోయే ఈ చిక్కుముడి ఏమి’టని నిట్టూరుస్తూనే పలువురు లబ్ధిదారులు అదనపు సొమ్ము వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. కాగా మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని క్వారీ ప్రాంతనేత, మాజీ కార్పొరేటర్ చోడిశెట్టి రాఘవబాబు హెచ్చరిస్తున్నారు.
దక్కబోయే వేళ చిక్కుముడి
Published Thu, Dec 12 2013 2:55 AM | Last Updated on Sat, Jul 7 2018 2:52 PM
Advertisement
Advertisement