అనంతపురం: కార్యాలయానికి పనివేళలు లేవా? ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టానుసారంగా వచ్చిపోవడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా..? అంటూ అనంతపురం పరిపాలనా విభాగం సిబ్బందిపై అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పలువురు సిబ్బంది కార్యాలయానికి వచ్చి హాజరు పట్టీలో సంతకం చేసి సొంత పనులపై వెళ్లారు. మరికొందరు సంతకం చేయకుండా వెళ్లారు. విషయం తెలుసుకున్న అదనపు కమిషనర్ పరిపాలనా విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వచ్చిన సమయంలో చాలామంది అధికారులు సీట్లలో లేరు. దాదాపుగా విభాగం అంతా ఖాళీగా ఉంది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
హాజరు పట్టీని పరిశీలించిన ఆయన.. అందరూ ఎక్కడికి వెళ్లారని అడిగారు. పెళ్లికి వెళ్లారని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో.. పెళ్లికి వెళ్లాలనుకునేవారు సెలవు పెట్టి వెళ్లాలి. కానీ హాజరు పట్టీలో సంతకం చేసి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. వేళకు రాని వారందరికీ క్యాజువల్ లీవ్ మార్క్ చేయాలని మేనేజర్‌కి సూచించారు. కొందరి సంతకాలకు ఎదురుగా చుక్కలు పెట్టి ఉండడాన్ని గుర్తించిన ఆయన ఎందుకు ఇలా చుక్కలు ఉంచారని ప్రశ్నించారు. ఒక ఉద్యోగికి సంబంధించి నాలుగు రోజులుగా హాజరు పట్టీలో సంతకం ఉండాల్సిన స్థానంలో చుక్కలు ఉన్నాయి. నాలుగు రోజులుగా ఆ ఉద్యోగి ఎందుకు సంతకం చేయలేదని, కనీసం మీరు అదైనా గమనించారా అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇలా చుక్కలు ఉంచేది ఒక రోజున వచ్చి సంతకాలు చేయడానికే అంటూ మండిపడ్డారు. తక్షణం సెలవు మార్క్ చేయండని ఆదేశించారు. అనంతరం అన్ని సీట్లను, విభాగాలను పరిశీలించారు. పనివేళల్లో తప్పనిసరిగా సీట్లలో ఉండాలని, ఇష్టానుసారం వచ్చిపోతే చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించారు.
ఇష్టానుసారం వస్తే సహించేది లేదు
Published Thu, Apr 30 2015 6:00 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement