బుధవారం సచివాలయంలో తెలంగాణ అఖిల పక్ష ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన రెండు రాష్ట్రాల సీఈవో భన్వర్‌లాల్
- రెండు రాష్ట్రాల సీఈవో భన్వర్‌లాల్
హైదరాబాద్: ఓటర్లకు ఆధార్ అనుసంధానంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓటర్లకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను మే నెలాఖరులోగా నూటికి నూరు శాతం పూర్తి చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్లకు ఆధార్ అనుసంధానంపై భన్వర్‌లాల్ బుధవారం సచివాలయంలో తెలంగాణలోని రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ఇప్పటి వరకు 76.35 శాతం ఓటర్లకు ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. ఏపీలో 84.30 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రక్రియ కేవలం 30 శాతమే జరిగిందని, దీంతో తెలంగాణ అనుసంధానం శాతం తక్కువగా ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట ర్లకు ఆధార్ అనుసంధానం వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి గురువారం అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలి పారు. తెలంగాణకు చెందిన పార్టీల ప్రతి నిధులు కూడా ఆధార్ అనుసంధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరగా పూర్తి చేయడానికి సహకరిస్తామని తెలిపారన్నారు.
మే నెలాఖరు నాటికి నూటికి నూరుశాతం పూర్తి చేయడానికి ప్రత్యేకంగా బూత్ స్థాయి ఆఫీసర్లను ఇంటింటికీ పంపించి ఆధార్ నంబర్లను సేకరించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. జూలై ఒకటి కల్లా అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి ఓటర్ల జాబితాలను ప్రకటిస్తామని వివరించారు. ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ ఓటర్లను, మృతి చెందిన ఓటర్లను మాత్రమే తొలగిస్తామన్నారు. ఇంటికి తాళం వేసి ఉన్నంత మాత్రాన వెంటనే ఆధార్ లేదని ఓటర్లను తొలగించబోమన్నారు.
అనుసంధానం కోసం ఆధార్ నంబర్‌ను, ఓటర్ కార్డు నంబర్‌ను 87904 99899కు ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా పంపించవచ్చని తెలిపారు. అలాగే 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్, ఆధార్ నంబర్ వివరాలను తెలపవచ్చన్నారు. ఈ ప్రక్రియలో బాగా పనిచేసిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, బూత్ స్థాయి అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగదు బహుమతులను ప్రకటించిందని, ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వాటిని బహూకరిస్తామని తెలిపారు.