సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొడుతున్న సీ ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణకు నిరసనగా ఇచ్చిన బంద్ పిలుపునకు శనివారం అనూహ్య స్పందన లభించింది. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, న్యాయవాదులు, వ్యాపారులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్థంభించింది. వ్యాపార సంస్థలు, బ్యాంక్‌లు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు బంద్ పాటించాయి. ఈ సందర్బంగా జిల్లా అంతటా ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వం, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బస్సులు తిరగకపోవడంతో ఆర్టీసీకి రూ.50 లక్షల నష్టం వాటిల్లింది.
24 గంటలు.. విశేష స్పందన..
శుక్రవారం అర్ధరాత్రి నుంచి మొదలైన బంద్ కోసం తెలంగాణవాదులు అప్పుడే సన్నద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రజలు, ప్రజాస్వామికవాదులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి వరకు కూడా ఆర్టీసీ బస్సులు బయటకు తీయలేదు. ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా బంద్‌లో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఉట్నూర్ డిపోల పరిధిలోని 588 బస్సులు ఎక్కడికక్కడే నిలిచాయి. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ తదితర ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
సమైక్యసభను నిరసిస్తూ బేల మండల కేంద్రంలో అంతరాష్ట్ర రహదారిపై జేఏసీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. సమైక్యవాదుల ఫ్లెక్సీని దహనం చేశారు. సిర్సన్న గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. మంచిర్యాలలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తెలంగాణ నినాదాలు చేశారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిరసన తెలుపుతూ సీఎంపై మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు.
ఊరూవాడా వెల్లువెత్తిన నిరసన..
శ్రీరాంపూర్, సీసీసీ ఏరియాలో జేఏసీ నాయకులు దగ్గరుండి బంద్ విజయవంతం చేయించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్‌ఆర్‌పీ 3, 3ఏ గనుల పై సీఎం, డీజీపీల దిష్టిబొమ్మలను కార్మికులు దహనం చేశారు. లక్సెట్టిపేట, దండేపల్లి, మేదరిపేట, తాళ్లపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్ , బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు చేశారు. ఆసిఫాబాద్ ఏరియాలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. దుకాణాలు, బ్యాంకులు, పెట్రోలు బంక్‌లు, వాణిజ్య వ్యాపార సంస్థలు మూసివేశారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
బెల్లంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం ఆటంకం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర నేతల దిష్టిబొమ్మను కార్మికులు తగలబెట్టారు. ఉట్నూర్‌లో టీఎన్‌జీవోల ఆధ్వర్యంలో ఐటీడీఏ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు. జన్నారం మండలంలో మానవహారంగా ఏర్పడ్డారు. చెన్నూర్‌లోనూ బంద్ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. భైంసా, ముథోల్, కుంటాల, కుభీర్, లోకేశ్వరం, తానూరు మండలాల్లోనూ బంద్ కొనసాగింది. కాగజ్‌నగర్‌లో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
బంద్ సక్సెస్
Published Sun, Sep 8 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
Advertisement