చదివేదెలా? | adimulapu suresh listen the problems of students | Sakshi
Sakshi News home page

చదివేదెలా?

Published Sun, Nov 30 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

చదివేదెలా?

చదివేదెలా?

జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువైంది. అక్కడి విద్యార్థ్ధినీ, విద్యార్థులకు రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దోమల మధ్య, అశుభ్ర వాతావరణంలో చదువు కొండెక్కుతోంది. మద్దిపాడు మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయి... విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి శనివారం సంతనూతలపాడు  శాసనసభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్  ‘సాక్షి’ విలేకరిగా మారారు.
 
ఉదయం ఎనిమిది గంటల సమయంలో మద్దిపాడు హాస్టల్‌కు చేరుకున్న ఆయన తొలుత బాలుర హాస్టల్‌కు వెళ్లారు. ఆయన వెళ్లే సరికి పిల్లలు కొందరు స్నానాలు చేస్తుండగా, మరికొందరు స్కూల్‌కు తయారవుతున్నారు. ఇంకొందరు ఆడుకుంటున్నారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఎక్కడా కనపడలేదు.
 
ఆదిమూలపు సురేష్ : బాత్ రూములు ఎన్ని ఉన్నాయి.
విద్యార్థులు : మొత్తం వందమందికి మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. మరో ఏడు పనిచేయడం లేదు. కొత్తగా ఏడు బాత్‌రూములు కట్టినా అవి ఇంకా ప్రారంభించలేదు.
ఆదిమూలపు సురేష్ : వందమందికి మూడు టాయిలెట్లేనా?
విద్యార్ధులు : అవును సార్ అక్కడి నుంచి పిల్లలు స్నానం చేసే చోటకి వచ్చారు. అక్కడ పిల్లలు సంప్‌లోకి దిగి నీటిని బక్కెట్లతో తోడుకుంటున్నారు.
ఆదిమూలపు సురేష్ : ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి.
విద్యార్ధి : గుండ్లకమ్మ నుంచి వస్తున్నాయి. ఉదయం పూట కరెంట్ ఉండటం లేదు. దీంతో మోటార్ పనిచేయకపోవడం వల్ల మిగిలిన పంపులు పనిచేయడం లేదు. అందుకే ఈ నీళ్లు పట్టుకుని స్నానాలు చేస్తున్నాం.
ఆదిమూలపు సురేష్ : కరెంట్ లేదా? ఎప్పుడు వస్తుంది
విద్యార్ధి : తెలియదు సర్
ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ? ఎన్నో తరగతి చదువుతున్నావు.
మధు : నా పేరు మధు, పదో తరగతి చదువుతున్నాను. ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను.
ఆదిమూలపు సురేష్ : ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చెబుతావా?
మధు : స్నానం చేయడానికి బక్కెట్లుండవు, కరెంట్ ఉండదు, ఆ డ్రైనేజీ వల్ల దోమలు. వీటి వల్ల జ్వరాలు వస్తున్నాయి.
ఆదిమూలపు సురేష్ : మీకు డాక్టర్ ఉన్నారా? వస్తున్నారా? మందులు ఇస్తున్నారా?
మధు : ఉన్నారు. నెలకోసారి వచ్చి అందరినీ పరీక్షించి మందులు ఇస్తారు.
ఆదిమూలపు సురేష్ : మరుగుదొడ్లు సరిపోతున్నాయా?
మధు : సరిపోవడం లేదు. మూడు ఉన్నాయి.  వంద మందికి మూడు టాయిలెట్లు ఉన్నాయి.
ఆదిమూలపు సురేష్ : మరి బాత్రూములున్నాయా?
మధు : లేవు, బయటే స్నానం చేస్తాం. వర్షాకాలం కూడా ఇక్కడే స్నానం చేయాల్సి వస్తోంది.
ఆదిమూలపు సురేష్ : మీకు యూనిఫామ్స్ వచ్చాయా, ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకుంటారా?
విద్యార్ధులు :  యూనిఫామ్స్ వచ్చాయి. అటెండెన్స్ వేస్తున్నారు.
ఆదిమూలపు సురేష్ : ఈ రోజు ఏం పెట్టారు
విద్యార్ధులు : రాగి జావ
ఆదిమూలపు సురేష్ : నీపేరేంటి? ఏం సమస్యలు ఉన్నాయి?
గోవిందు : నాపేరు గోవిందు. గదులకు కిటికీలు లేవు.
విద్యార్ధులు : దోమలు పెద్ద సమస్య. కిటికీలకు తలుపులు లేవు. డ్రైనేజి వల్ల దోమలు వస్తున్నాయి. టాప్‌లు లేవు. బాత్‌రూములు చాలా ఇబ్బందిగా ఉన్నాయి.  నీరు సరిగా రావడం లేదు.
ఆదిమూలపు సురేష్ : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగారు ఒక నెంబర్ ఇచ్చి సమస్యలు మీకు చెప్పమన్నారు. ఆ నెంబర్ తెలుసా?
విద్యార్ధులు : తెలియదు.
ఆదిమూలపు సరేష్ : తలుపులు కిటికీలు పెట్టిస్తాము. (బట్టలు ఆరేసుకోవడానికి స్థలం లేదు. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఒకచోట కాంపౌండ్ వాల్ లేదు. దీంతో పాములు, ఇతర జంతువులు లోపలికి వస్తున్నాయి. విద్యార్థులు చెప్పిన సమస్యలు చూడడానికి హాస్ఠల్‌లోని గదుల్లోకి వెళ్లి తలుపులు లేని కిటికీలను పరిశీలించారు. కరెంట్ వైర్లు కూడా ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. వీటిని కూడా ఎమ్మెల్యేకు చూపించారు. కిటికీలకు మెష్ లేదు. పక్కనే డ్రైనేజీ వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయని చూపించారు. వర్షం పడితే శ్లాబు కురుస్తోంది.)
ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటి?
ఏసు : నా పేరు ఏసు, ఒకటో నెంబర్ రూమ్ పక్కనే డ్రైనేజీ ఉంది, దీనివల్ల దోమలు వస్తున్నాయి. అంటూ ఎమ్మెల్యేని డ్రైనేజీల వద్దకు తీసుకువెళ్లారు. ఆ డైనేజీ నీటిపారుదల సక్రమంగా లేకపోవడం వల్ల అందులో పెద్ద సంఖ్యలో దోమలు పెరుగుతున్నాయి. పక్కనే చెత్త కూడా పెద్ద సంఖ్యలో పడేశారు.
 ఆదిమూలపు సురేష్ : డ్రైనేజీ పక్కనే పెద్ద ఎత్తున చెత్త వేశారు. పక్కనే హాస్టల్ కిటికీలున్నాయి. వీటికి కనీసం మెష్ కూడా లేదు. కిటికీ తలుపులు లేవు. దీనివల్ల ఈ గదుల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కిటీకీలకు మెష్ బిగించి, డ్రైనేజీ బాగు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ డ్రైనేజీ వల్ల ప్రమాదం పొంచి ఉంది.
(అక్కడి నుంచి ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న బాలికల హాస్టల్‌కు వెళ్లారు. దానికి వెళ్లే రోడ్డు కూడా సరిగా లేదు. పైగా దారికి ఇరువైపులా మలమూత్ర విసర్జనతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ భవనంలో నాలుగు గదులుండగా అందులో ఒకటి వార్డెన్ రూముగా, మరొకటి స్టోర్‌రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకచిన్న గదితోపాటు హాల్ మాత్రమే విద్యార్థినుల కోసం ఉంది. ఇందులో 70 మంది ఉంటున్నారు. అక్కడ  బాలికల టాయిలెట్‌కు కనీసం తలుపులు లేకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి వెంటనే డోర్ పెట్టించాలని ఆదేశించారు. గోడకు అతికించిన మెనూను పరిశీలించారు. ఎలా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాగేనీరు కూడా మురికిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ కూడా వార్డెన్ అందుబాటులో లేరు. )
ప్రజెంటర్ : దాళా రమేష్‌బాబు
ఫోటోలు : కె. శ్రీనివాసులు
 
పరిష్కారానికి పోరాడుతా...
సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది.
పధానంగా పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపించాలి. యుద్ధప్రాతిపదికన వసతి గృహ భవనాలు ఏర్పాటు చేయాలి. బాలికలకు రక్షణ లేని దుస్థితిలో భవనాలున్నాయి.
సాంఘిక సంక్షేమ శాఖ వారు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్‌కు, ఉన్న సంఖ్యకు సంబంధం లేదు. పిల్లలను రాత్రి ఇంటికి పంపిస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత. కాంపౌండ్ వాల్స్ పూర్తిగా కట్టాలి. అరకొరగా మరుగుదొడ్లున్నాయి.
పదోతరగతి విద్యార్థులకు చదువుకోవడానికి విద్యుత్ కోతల సమయంలో ఇన్‌వర్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఎన్నికల సమయంలో హాస్టల్స్‌కు సోలార్ ఫెన్సింగ్, బయోమెట్రిక్ హాజరు, కంప్యూటరైజేషన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.  ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. విద్యార్ధులకు మంచి సదుపాయాలు కల్పించేవరకూ పోరాడతా.
పర్యవేక్షించాల్సిన వార్డెన్లు హాస్టళ్లల్లో లేకపోవడం విచారకరం.
 
ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ, ఇక్కడ ఏం చేస్తున్నావు. ఎంత మంది ఉంటారు?
వంటమనిషి : నా పేరు రాణి, ఇక్కడ 70 మంది ఉంటున్నారు. ఇక్కడ పడుకోడానికి స్థలం లేకపోవడంతో 30 మంది వరకూ ఇంటికి వెళ్లి పడుకుని ఉదయాన్నే వస్తున్నాం.
ఆదిమూలపు సురేష్ : పిల్లలను ఇంటికి ఎలా పంపిస్తారు?
వంటమనిషి : వారి తల్లితండ్రులు వచ్చి తీసుకువెళ్తారు. లేనిపక్షంలో ఇక్కడే ఉంటారు.
(రెండు హాస్టల్స్‌లో వార్డెన్లు అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగారు తనిఖీలకు వచ్చారని తెలియగానే ఆగమేఘాలపై ఒంగోలు నుంచి వచ్చారు. ఆయన ఎంపీపీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్నారు.)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement