సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థుల రక్షణకు ఏర్పాట్లు చేయించడంతోపాటు అక్కడి నుంచి క్షేమంగా వారిని రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఇప్పటికే ఈ విషయంలో కేంద్రాన్ని రాష్ట్రం సంప్రదించిందన్నారు. సీఎం వైఎస్ జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ కూడా రాశారని చెప్పారు. కేంద్రం కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసిందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థుల విషయమై మంత్రి ‘సాక్షి’తో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విద్యార్థుల భద్రతకు చర్యలు చేపడుతున్నందున వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. ఇప్పటికే ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ద్వారా ఆయా విద్యార్థులకు కావలసిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నోడల్ అధికారిని, విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులకు వీలుగా ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటుచేశామని తెలిపారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ఇప్పటికే నేరుగా మాట్లాడి వారికి «ధైర్యం చెప్పామన్నారు. అక్కడి భారత ఎంబసీ కూడా విద్యార్థులకు అనేక సూచనలు అందించిందని, వాటి ప్రకారం నడచుకోవాలని తెలిపామన్నారు.
ప్రత్యేక ఫోన్ నెంబర్లు, వెబ్‌లింక్ ఏర్పాటు
విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు వారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఏపీఎన్‌ఆర్టీఎస్ ద్వారా ప్రత్యేక ఫోన్ నెంబర్లను ఏర్పాటుచేయించామన్నారు. అలాగే, భారత ఎంబసీ అధికారులు కూడా ప్రత్యేక వెబ్‌లింక్‌ను ఏర్పాటుచేశారని, దాని ద్వారా కూడా వారు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైన సహకారం అందించేలా ఏర్పాట్లుచేస్తున్నారన్నారు. ఇక ఉక్రెయిన్‌లో ఆకాశమార్గాన్ని మూసేసినందున అక్కడికి విమానాలను సైతం పంపేందుకు వీల్లేని పరిస్థితులున్నాయన్నారు. ఈ విషయంలో కేంద్రం ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తోందని మంత్రి సురేష్ తెలిపారు.
ఆందోళన చెందొద్దు
Published Fri, Feb 25 2022 4:11 AM | Last Updated on Fri, Feb 25 2022 3:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment