విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న రత్నాకర్, అధికారులు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/విమానాశ్రయం (గన్నవరం): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను ప్రభుత్వం వేగంగా రాష్ట్రానికి తీసుకొస్తోంది. గడిచిన 24 గంటల్లో 109 మంది విద్యార్థులను తీసుకురావడంతో ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 558 మంది విద్యార్థులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లయింది. మొత్తం 770 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు సమాచారం ఉందని, మిగిలిన వారిని త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లో ఉన్న మరో 86 మంది విద్యార్థులను క్షేమంగా రుమేనియాకు తరలించినట్లు అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంద్ర డిప్యూటీ సలహాదారు చంద్రహాసరెడ్డి తెలిపారు. హంగేరి నుంచి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దాదాపుగా స్వరాష్ట్రానికి చేరుకున్నారని అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఏపీఎన్‌ఆర్టీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి ‘సాక్షి’కి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి మరో 1,100 మంది భారతీయులు హంగేరికి వస్తున్నారని ఎంబసీ నుంచి సమాచారం ఉందని తెలిపారు.
ఢిల్లీ చేరుకున్న 109 మంది విద్యార్థులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 109 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి వచ్చిన వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీరందరినీ స్వస్థలాలకు చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు.
గన్నవరం చేరుకున్న 35 మంది
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీ చేరుకున్న రాష్ట్ర విద్యార్థుల్లో 35 మందిని రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు, హైదరాబాద్ మీదుగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం తీసుకొచ్చింది. వీరందరూ ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ తదితర ప్రాంతాల నుంచి అతికష్టం మీద రైలు, రోడ్డు మార్గాలు ద్వారా హోలాండ్, రుమేనియా బోర్డర్లకు చేరుకుని ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి చేరుకున్నారు.
విమానాశ్రయంలో విద్యార్థులకు నార్త్ అమెరికా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ వెంకట్, విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు షేక్ బాజీ, శ్రీరామ్, శ్రీధర్, గణేష్, శేషుకుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థుల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వారున్నారు.
Comments
Please login to add a commentAdd a comment