క్షేమంగా చేరుస్తాం..  | MT Krishna babu about Andhra Pradesh Students In Ukraine | Sakshi
Sakshi News home page

క్షేమంగా చేరుస్తాం.. 

Feb 27 2022 3:33 AM | Updated on Feb 27 2022 3:33 AM

MT Krishna babu about Andhra Pradesh Students In Ukraine - Sakshi

సాక్షి, అమరావతి : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను ఖర్చుకు వెనకాడకుండా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఉక్రెయిన్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఆ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర విద్యార్థులను ప్రభుత్వ ఖర్చుతో స్వస్థలాలకు చేర్చాలని సీఎం ఆదేశించారని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి ఇండియాకు భారత ప్రభుత్వం ఉచితంగా విమానాల్లో తీసుకు వస్తుండగా, అక్కడి నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందుకోసం ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో రాష్ట్రం తరఫున రెండు రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై రిసెప్షన్‌ కేంద్ర బాధ్యతలను రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ ఐజీ రామకృష్ణ, ఢిల్లీ బాధ్యతలను రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్, డిప్యూటీ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షుకు అప్పజెప్పామని తెలిపారు.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే వారు ఈ రిసెప్షన్‌ కేంద్రాలను సంప్రదిస్తే.. వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఉచిత భోజన, ప్రయాణ వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. శనివారం వచ్చే రెండు ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి చెందిన 22 మంది ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపిందనీ, అయితే వారిని సంప్రదిస్తే అందులో చాలా మంది ఇతర రాష్ట్రాలవారున్నారు. ఆర్‌టీజీఎస్‌ కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి, 24 గంటలు సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


ఎక్కడి వారు అక్కడే ఉండండి..
ఉక్రెయిన్‌లో ఉన్న మన వాళ్లందరూ కేంద్ర విదేశాంగ శాఖ ఇచ్చే సూచనలను తూ.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. తొలుత సరిహద్దు దేశాల వద్దకు చేరితే, అక్కడి నుంచి తరలిస్తామని భారత ప్రభుత్వం చెప్పిందని, అయితే ఇప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆదేశాలు జారీ చేయడంతో అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కృష్ణబాబు సూచించారు. విద్యార్థులు ఎటువంటి సాహస కార్యక్రమాలు చేయకుండా ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలన్నారు.

ఏ విధంగా ఎక్కడికి రావాలో భారత ఎంబసీ చేసే సూచనలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం, సూచనలు, సలహాలు చేరవేయడం కోసంఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారి కోసం ప్రత్యేకంగా వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ గ్రూపులో 300 మంది సభ్యులుగా చేరినప్పటికీ, వాస్తవంగా ఇప్పటి వరకు 212 మంది రాష్ట్ర విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువస్తుందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ధైర్యంగా ఉండాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement