Andhra Pradesh: క్షేమంగా స్వస్థలాలకు.. | Arrival of 27 students so far from Ukraine | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: క్షేమంగా స్వస్థలాలకు..

Published Mon, Feb 28 2022 4:28 AM | Last Updated on Mon, Feb 28 2022 8:57 AM

Arrival of 27 students so far from Ukraine - Sakshi

గన్నవరం విమానా్రశ్రయానికి చేరుకున్న ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన ఏపీ వైద్య విద్యార్థులు

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/నెట్‌వర్క్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా స్వస్థలాలకు చేరుస్తోంది. ఇప్పటివరకు నాలుగు విడతలుగా మొత్తం 27 మంది విద్యార్థులు ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలకు ఆదివారం చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ భవన్‌ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ ఆదేశాల మేరకు విమానాశ్రయంలో ఏర్పాటైన హెల్ప్‌ డెస్క్‌ సిబ్బంది విద్యార్థులు ఏపీ భవన్‌కు చేరుకోవడానికి సహకరించారు. స్వగ్రామాలకు చేర్చేందుకు వీరిని అక్కడ నుంచి విమానాల్లో రాష్ట్రానికి తీసుకువస్తున్నారు.

ఇప్పటివరకు నాలుగు విమానాల్లో విద్యార్థులను భారత్‌కు తరలించగా మిగిలిన వారినీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొలి విడతగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆదివారం మ.12 గంటల 5 నిమిషాలకు గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయిప్రణీత్, కాసాని కావ్యశ్రీ విద్యార్థులు క్షేమంగా చేరుకున్నారు. వీరికి నూజివీడు ఆర్డీఓ కే. రాజ్యలక్ష్మి, తహశీల్దార్‌ సీహెచ్‌ నరసింహారావు, డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రావు స్వాగతం పలికారు. భోజనానంతరం ప్రత్యేక వాహనాల్లో వారిని సొంతూర్లకు పంపించారు. విద్యార్థులు రాగానే వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు ఎంతో ధైర్యం చెప్పి, పిల్లలను క్షేమంగా చేర్చినందుకు ఇండియన్‌ ఎంబసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు రోజులుగా ఎంతో ఆందోళనకు గురయ్యామని.. ఉక్రెయిన్‌ నుండి రొమేనియా దేశానికి చేరుకునే సమయంలో సరిహద్దు వద్ద తమ పిల్లల సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో ఎంతో భయపడ్డామని.. కానీ, అంతలోనే వారు క్షేమంగా ఉన్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నుండి ఫోన్‌ రాగానే ఊపిరిపీల్చుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

అదే విధంగా మదనపల్లి, తిరుపతి, కడప, రాజమహేంద్రవరం, కర్నూలుకు చెందిన విద్యార్థులను కూడా అధికారులు వారి స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చారు. మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ పరిధి సారథి గ్రామానికి చెందిన వెన్నెల వర్ష ఆదివారం ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులు లావణ్య, సోమశేఖర్‌లను చూడగానే గట్టిగా హత్తుకుని కన్నీటిపర్యంతమైంది. అలాగే, చిత్తూరు జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు నాగసత్య,, ప్రవీణ్, హర్షిత, పావని, గోపికవర్షిణి, జయశ్రీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వారివారి గమ్యాలకు చేరుకున్నారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన చల్లా సుదర్శన, రాజనాల సుష్మ కూడా ఆదివారం సురక్షితంగా స్వగ్రామం చేరుకున్నారు.

వీరిద్దరినీ చూడగానే వారి తల్లిదండ్రులు గుండెకు హత్తుకున్నారు. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఆదివారం రాత్రి విజయవాడ విమానాశ్రయానికి కృష్ణాజిల్లాకు చెందిన రాజులపాటి అనూష, షేక్‌ ఫర్జానా కౌసర్, గుంటూరుకు చెందిన వేముల వంశీకుమార్, తెనాలికి చెందిన మంత్రి అభిషేక్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి రెవెన్యూ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో ఎన్నో అడ్డంకులను, కష్టాలను ఎదుర్కొని ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. యుద్ధ వాతావరణం నుంచి క్షేమంగా ఇళ్లకు తీసుకొచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు.
గన్నవరం విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న నూజివీడు ఆర్డీఓ రాజ్యలక్ష్మి తదితరులు 

మొత్తం 507 మంది విద్యార్థులు
మరోవైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని గుర్తించే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఇందుకోసం రాష్ట్రస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో పాటు, ప్రతీ జిల్లా స్థాయిలో దీనిని ఏర్పాటుచేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు వీటికి వచ్చిన కాల్స్‌ ఆధారంగా 507 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నట్లు గుర్తించామని వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన సమాచారాన్ని విదేశాంగ శాఖకు అందజేసి వారిని స్వదేశానికి తీసుకువచ్చే 
ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. 

ముంబైకి చేరుకున్న విద్యార్థులు..
కావ్యశ్రీ, కొండమర్రి ప్రవీణ్, అల్లాడి నాగ సత్య హర్షిణి, రాజనాల సుష్మ, చల్లా సుదర్శన,, షేక్‌ రీను, జంబుగోళం పావని, దరువూరి సాయిప్రవీణ్, వెన్నెల వర్ష, గాధంశెట్టి గోపిక వర్షిణి.

ఢిల్లీకి చేరుకున్న వారు..
షేక్‌ ఫర్జానా కౌశర్, రాజులపాటి అనూష, సిమ్ము కోహిమా వైశాలి, చొక్కా తేజశ్వని, వల్లకొండ సాయి స్కందన, గౌతమి, టి.హర్షిత, పి.జయశ్రీ, అభిషేక్‌ మంత్రి, పెద్దినిశెట్టి సూర్యసాయి కిరణ్, వేముల వంశీకుమార్, గోగంటి నర్మద, లక్ష్మీధర్‌రెడ్డి, అమ్రితాన్‌‡్ష, సుమ, శ్వేత, శ్రీవిష్ణు ముత్యాల.

తిరిగి వస్తామనుకోలేదు
ఉక్రెయిన్‌ పశ్చిమ భాగంలోని చర్నవిస్ట్‌లో యుద్ధ ప్రభావం లేనప్పటికీ హాస్టల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపాం. బయట ఆహారం దొరకలేదు. ఈ నెల 25న స్వదేశం వచ్చేందుకు విమానం టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ రాజధాని కీవ్‌పై బాంబుల దాడితో ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీనితో చర్నవిస్ట్‌కు ఆరు కిలోమీటర్లు నడుచుకుని రొమేనియా దేశం సరిహద్దుకు చేరుకున్నాను. అక్కడ ఇండియన్‌ ఎంబసీ అధికారులు బుకారెస్టు ఎయిర్‌పోర్ట్‌ నుంచి తమను ముంబై తరలించారు. ఇక్కడ ఏపీ అధికారులు తమకు వసతి కల్పించడంతో పాటు హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు విమానంలో ఇక్కడికి తీసుకువచ్చారు. ఇండియన్‌ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం వల్లే క్షేమంగా ఇంటికి వచ్చా.
– సాయి ప్రవీణ్, గుంటూరు

అందరినీ చూస్తాననుకోలేదు
అందరినీ చూస్తానని నేను అనుకోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సాయం చేశాయి. ముఖ్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో చొరవ చూపించారు. అందుకే వేగంగా ఇంటికి చేరుకోగలిగాను. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రణస్థలం ఆర్‌ఐ వెంకటేష్‌తో పాటు పలువురు అధికారులు ఎస్కార్ట్‌గా వచ్చారు. ప్రత్యేక వాహనాన్ని సమకూర్చారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, జేసీ విజయసునీతలు గంటగంటకూ ఫోన్‌చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
– వెన్నెల వర్ష, రాజాం, శ్రీకాకుళం జిల్లా

ఎన్నో కష్టాలు పడ్డాం
ఉక్రెయిన్‌లో రష్యా దాడుల దృష్ట్యా అక్కడి నుంచి బయటపడేందుకు ఎన్నో కష్టాలు పడ్డాం. యూనివర్సిటీ ఏర్పాటు చేసిన బస్సుకు భారత జాతీయ జెండా కట్టి రొమేనియా బోర్డర్‌కు చేరుకున్నాం. అక్కడ కొన్ని గంటల నిరీక్షణ తర్వాత ఇండియన్‌ ఎంబసీ ద్వారా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తిరిగి సొంత గడ్డకు చేరుకున్నాం. 
– వేముల వంశీకుమార్, గుంటూరు

ఏపీ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు
యుద్ధ వాతావరణం కారణంగా చెర్నవిస్ట్‌లో ఏటీఎం, షాపుల వద్ద క్యూలైన్ల రద్దీతో బాగా ఇబ్బందులు పడ్డాం. అతికష్టం మీద రొమేనియా బోర్డర్‌కు చేరుకున్నప్పటికీ దేశం విడిచి వెళ్లేందుకు ఎక్కువమంది ప్రజలు చేరడంతో అక్కడా రద్దీ ఎక్కువైంది. ఇండియన్‌ ఎంబసీ అధికారులు మమ్మల్ని ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. న్యూఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరే వరకు ఏపీ అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు. 
– షేక్‌ ఫర్జానా కౌసర్, విజయవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement