వెలిగొండతో పశ్చిమాన ఆనందం | Adimulapu Suresh Said Veligonda Project Will Bring Smiles To Farmers | Sakshi
Sakshi News home page

వెలిగొండతో పశ్చిమాన ఆనందం

Published Wed, Sep 4 2019 8:13 AM | Last Updated on Wed, Sep 4 2019 8:13 AM

Adimulapu Suresh Said Veligonda Project Will Bring Smiles To Farmers - Sakshi

మొక్కలు నాటుతున్న విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమాలపు సురేష్‌

సాక్షి, గొబ్బూరు (ప్రకాశం): పశ్చిమ ప్రాంత వరప్రదాయిని వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మండలంలోని గొబ్బూరు గ్రామం సమీపంలో ఉన్న ఎన్‌ఎస్‌ అగ్రికల్చర్‌ కళాశాలలో జలశక్తి అభియాన్‌ సౌజన్యంతో దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయంలో నీటి సంరక్షణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమ్మీద పడిన ప్రతి వర్షపు నీటిని పొదుపు చేయాలన్నారు. భూగర్భజలాలు అడుగంటడంతో పశ్చిమ ప్రకాశం కరువు కాటకాలతో పొలాలు ఎడారిగా మారి రైతులు నష్టాలను చవిచూశారన్నారు.

వ్యవసాయధారంగా ఉండే పశ్చిమ ప్రకాశంలోని రైతులు ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 4,87,000 ఎకరాలకు సాగు, 15 లక్షల మందికి తాగు నీరు అందించే అవకాశం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజలను సంక్రాంతికి నీళ్లందిస్తానంటూ మభ్య పెట్టి మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరకు మొదటి టన్నెల్‌ పూర్తి చేసి 1.5 లక్షల ఎకరాలకు సాగు, 3 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. ముంపు గ్రామాల్లోని ఆరు వేల కుటుంబాలకు నిర్వాసితుల కేంద్రాలు, కాలనీలు ఏర్పాటు చేసిన తర్వాతే వారిని బయటికి తరలిస్తామని చెప్పారు.

మొదటి టన్నెల్‌ పూర్తికి ఇంకో 1.5 కిలోమీటర్లే..
వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పూర్తి చేయడానికి కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే ఉందని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ. 300 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పండించిన పంటలు మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి మండలంలో ఎకరా స్థలం కేటాయించి గోడౌన్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారి దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జలశక్తి అభియాన్‌ పథకం కింద నీటి వనరరులను పెంపొందేంచే పనులు చేట్టాలన్నారు. అనంతరం కళౠశాల చైర్మన్‌ నాదేళ్ల చంద్రమౌళి మంత్రి సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జునరెడ్డి రాంబాబులు, శాస్త్రవేత్తలకు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కె.శీనారెడ్డి, తహసీల్దార్‌ ఈ.చంద్రావతి, ఎంఈఓ వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శనరాజు, శాస్త్రవేత్తలు ఎన్‌.వి. రంగా, విజయాభినందన, పిన్సిపాల్‌ సెక్రెటరీ ముత్యాలనాయుడు, ఉపాధి హామీ ఏపీడీ వెంకట్వేర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

వెలిగొండతో సస్యశ్యామలం
యర్రగొండపాలెం: తీవ్ర కరువు, కాటకాలతో అలమటిస్తున్న పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ప్రధాన ఉద్ధేశంతో దింవగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాక్షస పాలన చేసిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రేమతో వాటిని ప్రారంభించలేదని, డబ్బులు దండుకోవటానికేనని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు తరువాత వెలిగొండ ప్రాజెక్టు సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.

వచ్చే ఏడాదికి వెలిగొండ నుంచి కృష్ణాజలాలు వస్తాయని ప్రజల హర్షధ్వనులమధ్య ఆయన ప్రకటించారు. అనంతరం పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డివైడర్లపై మొక్కలను నాటారు. వర్ధంతి సభానంతరం ఆయన పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు బజార్‌ ఏర్పాటు చేయటానికి ఎస్‌బీఐకు సమీపంలోని పంచాయతీ స్థలాన్ని ఆయన పరిశీలించారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.రాజశేఖరెడ్డి, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మాజీ ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, మండల అధ్యక్షుడు దొంతా కిరణ్‌గౌడ్, బీసీ, యువజన విభాగాల రాష్ట్ర కార్యదర్శులు ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, శ్రీశైలం దేవస్థానం కమిటీ మాజీ సభ్యుడు ఐ.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రైతు పక్షపాతి
వైఎస్సార్‌ సీపీ రైతు పక్షపాతి అని, బడ్జెట్‌లో రైతులకు అధిక నిధులు కేటాయించామని మంత్రి సురేష్‌ చెప్పారు. దళారుల వ్యవస్థ నిర్మూలించడానికి రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం మండల రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మార్కాపురం ఎమ్మెల్యే కుందుకు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పొలాల్లో కందకాలు, ఫారంపాండ్స్, చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసుకోవడంతో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత రైతులు వర్షం కురిస్తేనే పంటలు సాగు చేసుకునే పరిస్థితి ఉందని, త్వరలోనే ప్రాజెక్టును పూర్తి చేసి నీరందిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement