సాక్షి, కర్నూలు: వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ద్వారా ఈ ఏడాదిలోనే ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన సోమవారం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి శ్రీశైలం డ్యామ్ నుంచి బోట్‌లో వెళ్లి వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాంతంలోని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కలలను సాకారం చేసే దిశగా తలపెట్టిన అతి ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఉన్న రైతాంగానికి తాగు, సాగు నీటి అవసరాలు తీర్చుతుందని తెలిపారు. (ఏపిలోకి నైరుతి రుతుపవనాలు)
గత ప్రభుత్వాలు 12 సంవత్సరాలు అవుతున్నా వెలుగొండ ప్రాజెక్టు పనులను అంతంత మాత్రంగానే పూర్తి చేశారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం నాలుగు కిలోమీటర్ల టన్నెల్‌ను మాత్రమే పూర్తి చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం కేవలం16 నెలల్లో మూడు కిలోమీటర్లు టన్నెల్‌ను పూర్తి చేసిందని తెలిపారు. జూన్ 25 లోపు వెలుగొండ హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి సెప్టెంబర్ వరకు ప్రకాశం జిల్లాకు నీళ్లు అందిస్తామని తెలిపారు. ఏడున్నర కిలోమీటర్ల దూరమున్న రెండో టన్నెల్ పనులను 18 నెలల లోపు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తామని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment