సాక్షి, నెల్లూరు: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది దివాళాకోరు రాజకీయమని ధ్వజమెత్తారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టంగా చెప్పారని, ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధులకు హాజరుకాలేమని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.(చదవండి: ఎన్నికల షెడ్యూల్‌ను వెనక్కు తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో)
ఎన్ని కుట్రలు చేసినా అమ్మ ఒడి ఎట్టి పరిస్థితుల్లో ఆగదని, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా ఎన్నికల కమిషన్ మారిందన్నారు. నిమ్మగడ్డ రమేష్ నిరంకుశ వైఖరిని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని ఆదిమూలపు తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేస్తారన్నారు. 44 లక్షల 891 మందికి అమ్మఒడి వర్తిస్తుందని.. రెండో విడతలో 1.76లక్షల మందికి అదనంగా లబ్ధి కలగనుందన్నారు. రూ.6,161 కోట్లతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.(చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు చేదు అనుభవం)
సైంధవుడిలా అడ్డుపడుతున్నారు: మంత్రి అనిల్
దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా అడ్డుకున్నారు. కొన్ని చోట్ల పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా అడ్డుకున్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగిస్తారు.
మహిళలే చంద్రబాబును తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. హైదరాబాద్‌కే చంద్రబాబు పూర్తిగా మకాం మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్‌లోనే కూర్చున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల కోసం కుట్రలు చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవు. ప్రజల కోసమే వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. తిరుపతి ఉపఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని’’ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.
టీడీపీతో కలిసున్నది మీరే కదా?: మంత్రి గౌతమ్‌రెడ్డి
పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాకే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టొద్దని, పరిశ్రమల కోసం భూములిచ్చిన వారికి, ఆయా గ్రామాల వారికి మొదటి ప్రాధాన్యతలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య కోర్సులను నిర్వహిస్తున్నాం. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అన్ని అనుమతులు ఉండాల్సిందే. టీడీపీ హయాంలోనే దివీస్ పరిశ్రమకు అనుమతులిచ్చారు. గతంలో టీడీపీతో కలిసున్నది మీరే కదా?. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు?. స్థానిక సమస్యలు పరిష్కరించకుండా ముందుకెళ్లొద్దని దివీస్‌ను ఆదేశించాం. పరిశ్రమ, మత్స్యశాఖల ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ప్రజల ప్రాణాలపై పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపాలని చెప్పాలని’’ మంత్రి గౌతమ్ రెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment