అత్యాధునిక వసతులతో నెల్లూరు మెడికల్ కళాశాల
నెల్లూరు(అర్బన్) : అత్యాధునిక వసతులతో నెల్లూరు మెడికల్ కళాశాల ఏర్పాటవుతోందని రాష్ట్ర పురపాలక మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను గురువారం మంత్రి నారాయణ పరిశీలించారు.
ఈ నెల 19న సీఎం చంద్రబాబు కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. తొలుత గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన కళాశాల మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం కళాశాల్లో ల్యాబ్, కాన్ఫరెన్స్‌హాలు, మూడు అంతస్తులను పరిశీలించారు. కలెక్టర్ శ్రీకాంత్ మెడికల్ కళాశాలలో వసతులు, సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి మంత్రికి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అత్యాధునిక వసతులతో మెడికల్ కళాశాల ఏర్పాటవుతోందన్నారు. 19వ తేదీన సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కళాశాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. సీఎం, కేంద్రమంత్రి వస్తున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశానికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతున్నారని చెప్పారు. చిన్న చిన్న లోపాలు గుర్తించామని, వాటిని సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం కళాశాల్లో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. మొదటి సంవత్సరం 150 మందికి ప్రవేశం కల్పిస్తున్నారని చెప్పారు.
అనంతరం ఆయన జిల్లా అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఆయన వెంట కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్, నెల్లూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ శ్యాంసన్, మెడికల్ కళాశాల నోడల్ అధికారి రంగారావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఠాగూర్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ అంకయ్య, డీసీహెచ్ విజయగౌరి, మాజీ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనూరాధ తదితరులున్నారు.