కిచెన్‌లు బోసిపోతున్నాయి. అయినా విభిన్న రకాల ఘుమ ఘుమలు వెదజల్లుతున్నాయి. జిహ్వకు నచ్చిన రుచులు క్షణాల్లో ముంగిట వాలుతున్నాయి. దీంతో పొయ్యిలకు పని లేకుండా పోతుంది. నగర జీవనంలో ఇది ప్రస్ఫుటిస్తుంది. ఉరుకుల పరుగుల జీవనానికి .. ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లు తోడవడంతో గృహిణులకు వంట భారం తప్పింది. మూడు పూటలా బయట ఫుడ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. నగర వాసుల అభిరుచులను పసిగట్టిన వివిధ యాప్‌లు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. సామాన్యులు కూడా బయటఫుడ్‌కే మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు పోతే ఇళ్లల్లో కిచెన్ కనిపించకుండాపోతుందేమో..!
సాక్షి, విశాఖపట్నం: ఉరుకుల పరుగుల జీవితాల్లో కనీసం వంట చేసి తినడానికి కూడా జనానికి సమయం.. ఓపిక దొరకడం లేదు. ఎవరికి వారు బిజీబీజీగా గడుపుతున్నారు. ముప్పొద్దులా వండి కాస్త రుచిగా తినేందుకు సైతం వారికి సమయం ఉండటం లేదు. ఉదయం హడావుడిగా లేవడం.. రెడీ అయ్యేందుకే సమయం సరిపోకపోవడం.., మధ్యాహ్నం ఇంటికి రాలేకపోవడం రాత్రి ఆలస్యంగా రావడం మొదలైన కారణాలు కడుపు నిండా కాస్త తిండి తినేందుకు కూడా తీరిక ఉండటం లేదు. ఫలితంగా ఇటీవల అధిక శాతం ప్రజలు బయటే కొని తింటున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం కూడా ఇంటి ఫుడ్ దూరమవడానికి కారణమవుతోంది.
చిన్న కుటుంబాలు పెరిగిపోవడం పల్లెల నుంచి జనం నగరాలకు అధికంగా వలసలు రావడం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం పిల్లల కార్పొరేట్ చదువులు వంటి కారణాలతో ప్రతీ ఒక్కరూ బిజీగా మారుతున్నారు. ఫలితంగా జిల్లాలో హోటళ్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. ప్రధానంగా రోడ్డు సైడ్ హోటళ్లు, మొబైల్ క్యాంటీన్లు రెస్టారెంట్‌లు, దాబాలు, ఫుడ్ డెలివరీ యాప్‌లు అధికమవుతున్నాయి.
రద్దీగా హోటళ్లు...
ముఖ్యంగా ఎన్‌ఎడీ జంక్షన్, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, వీఐపీరోడ్, అక్కయ్యపాలెం, అశీల్‌మెట్ట, సిరిపురం, బీచ్‌రోడ్డు, సీతమ్మధార, మద్దిలపాలెం మొదలైన కేంద్రాల్లో హోటళ్ల వ్యాపారం జోరందుకుంటోంది. ఇంట్లో వంట చేయకుండా హోటళ్ల నుంచే ఆహారం కొనుగోలు చేసుకొని భోజనం కానిచ్చేందుకు నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, హోటళ్లు పెరగుతున్నాయి. ఉద యం వేళల్లో టిఫిన్ సెంటర్లు, మొబైల్ క్యాంటీ న్లు, హోటళ్ల వద్ద అల్పాహారం కోసం రద్దీ కనిపిస్తోంది.
ఇంట్లో నలుగురు ఉంటే హోటళ్లో టిఫిన్ కొనాలంటే కనీసం రూ.150 అవుతుంది. అదే ఇంట్లో టిఫిన్ తయారు చేసుకుంటే రూ.50 సరి పోతుంది. కానీ ఖర్చుకు జనం వెనుకాడటం లే దు. కేవలం మధ్యాహ్న భోజనం మాత్రం వండుకుని ఆఫీస్‌కి వెళ్తున్నారు. ఒక్కోసారి అన్నం మా త్రం వండుకుని మార్గమధ్యంలోని కర్రీ పాయింట్లో కూరలు, సాంబార్ కొని తింటున్నారు.
యువతకు ఉపాధి..
ఫుడ్ డెలివరీ సంస్థలు రావడంతో స్థానికంగా ఉన్న యు వతకు ఉపాధి లభిస్తోంది. ఆహారం డెలివరీ చేసే సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తి నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లో రూ.20 వేల దాకా సంపాదిస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉంటున్నారు. ఒక్క నగరంలోనే ఫుడ్ డెలివరీ సంస్థల్లో పని..చేసే వారి సంఖ్య 500 దాకా చేరుకుందని సమాచారం. కేవలం ఇంటర్, డిగ్రీ చదివి ఉండి, సొంతంగా బైక్, స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఉద్యోగం ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు హోటళ్లు సైతం ఫుడ్ డెలివరీ సంస్థలకు డిస్కౌంట్లు ఇస్తుండటం, ఫుడ్ డెలివరీ చేసినందుకు కమీషన్లు ఉండటంతో ఈ సరికొత్త వ్యాపారం లాభసాటిగా ఉంటోందని యువత అభిప్రాయపడుతోంది.
ఆన్‌లైన్ ఆర్డర్ల జోరు..
ఏడాది కిందట నుంచి నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఉబెర్‌ఈట్స్, ఫుడ్‌పాండా.. ఇలా.. పలు ఆన్‌లైన్ సంస్థలు వచ్చాక ప్రజలు వాటి వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. మొదట్లో పిజ్జాలు, బర్గర్లు మాత్రమే ఆర్డర్ ద్వారా ఇంటికి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాటి స్థానంలో టిఫిన్లు, భోజనం, బిర్యానీలు కూడా చేరాయి. స్మార్ట్‌ఫోన్‌లో సదరు సంస్థల యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుని, అందులో నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే అతి తక్కువ సమయంలో కోరుకున్న ఆహారం ఇంటి ముందు..ప్రత్యక్షమవుతోంది. ఇలా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే వంటి సంస్థలు పలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ప్రకటించడం ఈ వ్యాపారానికి మరింత ఊతమిస్తోంది. రెండు కొంటే ఒకటి ఉచితమన్నట్లు ఈ వ్యాపారం ఉండటంతో జనం ఆసక్తి చూపుతున్నారు.
రాత్రి వేళా టిఫిన్లకే మొగ్గు
రాత్రి వేళ అన్నం బదులు టిఫిన్ తినడం ఇటీవల అధికమైంది. దీంతో వివిధ మోడళ్లలో రోడ్ల వెంబడి వెలసిన దుకాణాల్లో తిని ఇంటికి వెళ్తున్నారు. మరికొందరు తీరిగ్గా రెస్టారెంట్లకు వెళ్లి మాంసాహారం, ఇతర వెరైటీ వంటకాలు ఆరగించి వెళ్తున్నారు. దీంతో ఇంట్లో వండుకోవడం, అనంతరం పాత్రలు కడగడం వంటి శ్రమ తగ్గుతోందని అధిక శాతం భావిస్తున్నారు.
బయట ఫుడ్‌కే జై..
మేము ఉదయం నుంచి రాత్రి వరకు వ్యాపారంలో బిజీబిజీగా ఉంటున్నాం. ఒక్కోసారి మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనానికి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎక్కువసార్లు బయట నుంచే టిఫిన్లు, భోజనాలు తెచ్చుకుంటున్నాం. ఫుడ్ డెలివరీ సంస్థలతో హోటళ్లకు వెళ్లి తెచ్చుకునే కష్టం కూడా తప్పింది.
– జి.వేణుగోపాలరావు, వ్యాపారి, పెదవాల్తేరు
అలసట దూరం
భార్యా భర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కాలం వెళ్లదీయలేని రోజులివి. ఈ నేపథ్యంలో.. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. వారమంతా ఇంటి పని, ఆఫీస్.. ఇలా బిజీ బిజీగా గడుపుతాం. వారాంతంలోనూ పనిలో పడితే.. శారీరక అలసట ఎక్కువవుతోంది. అందుకే వీకెండ్‌లో హోటళ్లకు వెళ్లడం, లేదంటే.. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ.. రిలాక్స్ అవుతుంటాం.
– సీహెచ్ హిమబిందు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, నందగిరినగర్
ఇష్టమైనవన్నీ ఇంటికే
ఇంట్లో నచ్చిన వంటలు చేసుకొని తినాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. హోటల్‌కి వెళ్లి తినాలన్నా.. అక్కడ ఫుడ్ వచ్చేవరకూ వెయిట్ చెయ్యాలి. అదే.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి.. ఇంటిలో ఇతర పనులు పూర్తి చేసుకొనే సరికి ఇష్టమైన ఫుడ్ ఇంటికే వచ్చేస్తోంది. మనకు నచ్చినట్లుగా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు. – శారద, గృహిణి
Comments
Please login to add a commentAdd a comment