ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన వినియోగదారులకు కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. నిత్యం డెలివరీ చేసే ఆహారం పరిశుభ్రత, నాణ్యతను ధ్రువపరిచేలా ‘స్విగ్గీ సీల్’ పేరిట కొత్త సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం పుణెలో ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను 650 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
రెస్టారెంట్లలో తయారు చేస్తున్న ఆహారం శుభ్రత పట్ల అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రత పట్ల హామీ ఇచ్చేలా ‘స్విగ్గీ సీల్’ ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు. ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, మెరుగైన ప్యాకింగ్ ప్రమాణాలు అనుసరించే రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌కోర్టులకు ఈ స్విగ్గీసీల్ బ్యాడ్జ్‌ను జారీ చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామన్నారు. పరిశుభ్రతకు సంబంధించి రెస్టారెంట్‌లో ఆడిట్ నిర్వహించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు పొందిన ఏజెన్సీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని చెప్పారు. రెస్టారెంట్లకు అందుబాటు ధరలోనే ఈ ఆడిట్ సేవలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
వివిధ రెస్టారెంట్లలో పరిశుభ్రతకు సంబంధించి 70 లక్షల మంది యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ సేవలు ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ సీల్ గుర్తింపు తీసుకున్న ఫుడ్ తయారీదారులు నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కస్టమర్ల నుంచి సదరు రెస్టారెంట్ సేవలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే బ్యాడ్జ్‌ను తొలగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ సేవల వల్ల వినియోగదారులకు, రెస్టారెంట్లకు మేలు జరుగుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment