ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: ప్రేమించానని, పెళ్లాడతానని ఓ యువతిని నమ్మించి మోసగించిన వైరాకు చెందిన యువ న్యాయవాదికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కాశీవిశ్వేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తెలిపిన ప్రకారం...
వైరా మండలం కెజి సిరిపురం గ్రామస్తురాలైన యువతితో అదే గ్రామానికి చెందిన న్యాయవాది నారపోగు రాంబాబు(27)కు ఏడేళ్ల కిందట పరిచయమేర్పడింది. ఖమ్మం టూ టౌన్ పరిధిలోని ప్రయివేటు వైద్యశాలలో పనిచేస్తున్న ఆమెను ప్రేమిస్తున్నానంటూ అతడు కొంతకాలం వెంటబడ్డాడు. ఆ తరువాత, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా లైంగిక సంబంధం సాగించాడు. దీనిని మొదట ఆమె వ్యతిరేకించింది. పెళ్లాడతానని అతను పూర్తిగా నమ్మించడంతో ఆమె మిన్నకుంది. ఈ క్రమంలో, ఆమెకు అతడు మూడుసార్లు గర్భస్రావం చేయించాడు.
ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా.. జీవితంలో స్థిరపడిన తరువాత చేసుకుంటానని చెప్పేవాడు. కొంతకాలం తరువాత ఆమె గట్టిగా నిలేయడంతో.. ‘నీ దిక్కున్న చోట చెప్పుకో. నేను న్యాయవాదిని. చట్టం నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు’ అని బెదిరించాడు. దీంతో, ఆమె పెద్ద మనుషులను ఆశ్రయించింది. 2012 జూలై 23న ఇరుపక్షాల పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో కూడా, ఆమెతో పెళ్ళికి అతడు నిరాకరించి, దుర్భాషలాడాడు. అతని తల్లిదండ్రులు కూడా ఆమెను దుర్భాషలాడారు. ఆ యువతి అదే రోజున వైరా పోలీస్ స్టేషన్‌లో నారపోగు రాంబాబుపై, అతని తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ అధికార పరిధి దృష్ట్యా కేసును ఖమ్మం రెండో టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఖమ్మం టూ టౌన్ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
13మంది సాక్షులను ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఖమ్మం అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.కాశీవిశ్వేశ్వరరావు.. నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, నారపోగు రాంబాబుకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. బాధితురాలిని మోసగించినందుకుగాను మరో ఏడాది జైలు శిక్ష, 500 రూపాయల జరిమాన, దుర్భాషలాడినందుకు మరో నెల జైలు శిక్ష విధించారు. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలుజరగాలని తీర్పులో పేర్కొన్నారు. బాధితురాలిని దుర్భాషలాడినందుకుగాను రాంబాబు తల్లితండ్రులైన నారపోగు వీరమ్మ, నారపోగు క్రిష్ణయ్యకు వెయ్యి రూపాయల జరిమాన విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.అంజయ్య వాదించారు. ఆయనకు లైజన్ ఆఫీసర్లు రాజారావు, మెహన్‌రావు, కోర్టు కానిస్టేబుల్ లక్ష్మణ్, హోంగార్డులు సీతయ్య, చిట్టిబాబు సహకరించారు.
లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
Published Wed, Aug 7 2013 3:53 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement