
మా సోదరిపై పట్టపగలే లైంగికదాడి: నటి
లాస్ ఎంజెల్స్: తనతో సహా తన కుటుంబంలోని సభ్యులు కూడా ఏదో ఒక రూపంలో లైంగిక దాడులకు గురైన వాళ్లమేనని ప్రముఖ హాలీవుడ్ నటి గోల్డెన్ గ్లోబ్, బీఏఎఫ్ టీఏ, అకాడమీ అవార్డును పొందిన విజేత వయోలా డేవిస్ అన్నారు. అందుకే తాను నటిగా ఉండటంతోపాటు లైంగిక దాడులకు గురయ్యే బాధితుల ఫౌండేషన్ కు ఒక న్యాయవాదిగా కూడా మారినట్లు చెప్పారు. పలు హాలీవుడ్ చిత్రాలు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ గొప్పపేరును తెచ్చుకున్న లయోలా తొలిసారి ధైర్యంగా తనకు జరిగిన అనుభవాన్ని బయటపెట్టారు.
'నేను, నా తల్లి, నా సోదరీమణులు, నా స్నేహితురాలు రెబెక్కా చిన్నతనం నుంచే ఏదో ఒక రూపంలో లైంగిక దాడులు ఎదుర్కొన్నాం. మా అందరిదీ ఒకే సమస్య. లైంగిక వేధింపులు ఎదుర్కొని చనిపోకుండా బతికి బయటపడిన వాళ్లం. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా చుట్టుపరిస్థితులు దారుణంగా ఉండేవి. ఆ సమయంలో నీకు ఎవ్వరు డబ్బులిస్తే వారు నిన్ను స్పృషించవచ్చు. నా ఏడేళ్లప్పుడు ఒకసారి స్నేహితురాలి ఇంటికి పుట్టిన రోజుకు వెళితే అక్కడ ఎవరో ఒకరు అంతకుముందు తప్పుగా ప్రవర్తించినవారు ఉండేది. నా సోదరి డానియెల్పై ఎనిమిదేళ్లప్పుడే ఒక దుకాణదారుడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో లైంగికదాడి చేశాడు. మా అమ్మకు చెబితే అతడిని బజారుకు ఈడ్చింది. అతడు ప్రతినెల జరిమానా కట్టేలా దండించారు. దారుణం ఏమిటంటే అతడి దుకాణానికి వెళ్లిన చిన్నారులందరిపై ఇలాగే చేసేవాడు' అంటూ ఆమె తన బాల్యం, యుక్తవయసులోనే అనుభవాలు పంచుకుంది.