ఒంగోలు టౌన్ :గర్భిణులు, బాలింతలు, శిశువులకు సంబంధించిన వివరాలను ఈనెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోతే సంబంధిత సీడీపీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని కలెక్టర్ సుజాతశర్మ హెచ్చరించారు. ఎక్కడైనా అనారోగ్యంతో, పౌష్టికాహార లోపంతో శిశువులు మరణిస్తే సంబంధిత ఆరోగ్య కార్యకర్తతోపాటు అంగన్‌వాడీ కార్యకర్తపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో గర్భిణుల సగటు నమోదు 59శాతం ఉందని, మిగిలిన 41 శాతం గుర్తించడంలో అంగన్‌వాడీలు పూర్తిగా వెనుకబడ్డారని చెప్పారు. ఎంఎంఆర్, ఐఎంఆర్, గర్భిణుల ప్రసవ తేదీ వివరాలను ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుజాతశర్మ హెచ్చరించారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కే లీలావతి, లీగల్ కౌన్సిలర్ సిరిగిరి సరళ, ఐసీపీఎస్ డీసీపీవో జ్యోతిసుప్రియ పాల్గొన్నారు.
శిశువులు మరణిస్తే అంగన్‌వాడీలపై చర్యలు
Published Sun, Jun 21 2015 1:18 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement