మళ్లీ కోతపెడితే మెరుపు సమ్మె
కార్మికుల జీతాల్లో కోతతో
కొత్త బస్సుల కొనుగోలుపై కార్మికుల భగ్గు
మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరికతో
ఆర్టీసీ యాజమాన్యం వెనుకడుగు
గత నెలలో ఇలాగే 24 బస్సుల కొనుగోలు
హైదరాబాద్: వేతనాల్లో కోతపెట్టి కొత్త బస్సులు కొనాలనే ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. కార్మిక సంఘాలు మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. గత నెలలో ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు వేతనాన్ని మినహాయించిన అధికారులు వాటితో 24 కొత్త బస్సులు కొన్నారు. ఒక్క నెల, ఒక్కరోజే కదా అని అప్పట్లో కార్మికులు పెద్దగా నిరసన తెలపలేదు. కానీ, దాన్ని ఏకంగా ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం జూన్ నెల వేతనాల్లో కూడా కోత పెట్టేందుకు సిద్ధమైందన్న సంగతి తెలిసి కార్మికులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
నెలవారీ కోత రూ.4.5 కోట్లు...: తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడం భారంగా మారింది. దీంతో సిబ్బంది ‘చేయూత’తో గట్టెక్కేలా ఉన్నతాధికారి ఒకరు యాజమాన్యం ముందుకు ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతినెలా సిబ్బంది వేతనాల్లోంచి ఒకరోజు మొత్తాన్ని మినహాయిస్తే రూ.4.5 కోట్లు జమవుతుందని, దీంతో ప్రతినెలా జిల్లాకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిపి)ఓ బస్సు చొప్పున కొనవచ్చనేది ఆ ప్రతిపాదన. ఇదేదో బాగుందనుకున్న యాజమాన్యం గుర్తింపు పొందిన యూనియన్ నేతలతో భేటీ నిర్వహించి విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చింది. ఒకరోజు వేతనంతో ఏకంగా 24 బస్సులు కొనే అవకాశం ఉండడంతో దానికి వారు కూడా సరేనన్నారు. దీంతో మే నెలలో ఒకరోజు కోతపెట్టి రూ.4.5 కోట్లతో 24 బస్సులు కొన్నారు. కార్మికుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైనా యూనియన్ నాయకులు సర్దిచెప్పారు.
అయితే, జీతంలో కోత నిర్ణయాన్ని ఏడాదిపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్న అధికారులు జూన్ నెలలోనూ కట్ చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న కార్మిక సంఘాల నేతలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలోనే కార్మికులను అతికష్టమ్మీద ఒప్పించామని, ఇప్పుడు ఏకంగా 12 నెలల పాటు కోతపెడతామంటే ఊరుకునేది లేదని మండిపడ్డారు. కొత్త బస్సులను ప్రభుత్వ నిధులతోనో, గ్రాంట్లతోనే, కేంద్రం సాయంతోనే కొనాలి తప్ప ఇలా కార్మికుల వేత నాలతో కొనడం సరికాదంటూ మెరుపు సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు జీతంలో కోత పెట్టడం లేదంటూ ప్రకటించారు.