హైదరాబాద్ : విద్యుత్ సౌథ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం పోటా పోటీగా సభలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఒకరి నిరసనను మరొకరు అడ్డుకునే యత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించారు.
తెలంగాణ ఉద్యోగుల నిరసన సభలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొనగా, సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ వచ్చారు. ఈ సమయంలో తెలంగాణ ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా, పరకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అందుకు ప్రతిగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదుల దీక్షలో పాల్గొన్న పరకాల ప్రభాకర్ విభజన కుట్రను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు సర్ధిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.