గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ :
పోస్టల్ ఉద్యోగాల నియామకంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వయో పరిమితి సడలించాలని ఆలిండియా పోస్టల్ కోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ కార్యదర్శి డి.నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్వీఆర్ పబ్లిక్ స్కూల్లో మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరయిన ఆయన తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
మిగిలిన కులాలకు పోస్టల్‌లో 50ఏళ్ల వయో పరిమితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల పరిమితి పెంచాలని కోరారు. జాతీయ 7వ వేతన సంఘంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘానికి చెందిన ప్రతినిధిని సభ్యుడిగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఏటా ఏప్రిల్ 14న జరిగే డాక్టర్ అంబేద్కర్ జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కోరారు.
అనంతరం మచిలీపట్నం పోస్టల్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సంఘం 22వ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా జి.గంగాధరరావు, కార్యదర్శిగా వి.ఆంజనేయప్రసాద్, కోశాధికారిగా టి.రవీంద్రకుమార్ నాయక్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ఎస్పీ వై.రామకృష్ణ, ఏఎస్పీ బి.శ్రీనివాసరరావు, సంఘం నేతలు వై.వాసుదేవరావు, దాస్, అర్జున వి.ఎ.ప్రసాద్, విజయ్, సురేష్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
‘మైస్టాంప్’ ఆవిష్కరణ.....
మచిలీపట్నం పోస్టల్ డివిజన్ పరిధిలో రూరల్ పోస్ట్ ఇన్సూరెన్స్ పథకంలో 2 లక్షల మంది వినియోగదారులున్నారని మచిలీపట్నం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ వై.రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక ఎస్వీఆర్ పబ్లిక్ స్కూల్లో డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ పోస్టల్ ఎంప్లాయీస్ సమావేశానికి హాజరయ్యి ‘మై స్టాంప్’ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రూరల్ పోస్ట్ ఇన్సూరెన్స్‌లో ప్రీమియం మీద రిబేటులున్నాయని చెప్పారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో చేరే వినియోగదారులకు ఎలాంటి ఐటీ ఇబ్బందులుండవన్నారు. రూ.20 వేల నుంచి 20 లక్షల వరకూ పాలసీలు చేసుకోవచ్చని తెలిపారు. రికరింగ్ డిపాజిట్లలో భాగంగా ప్రొటక్స్ సేవింగ్స్ స్కీమ్‌లో అల్పాదాయ వర్గాల వినియోగదారులు చేరుతున్నారని చెప్పారు. రూ.10 నుంచి 50 వరకూ ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ప్రమాద వశాత్తు మృతి చెందితే ఐదేళ్లలో వచ్చే డిపాజిట్‌ను ముందే తీసుకోవచ్చని చెప్పారు.
అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రారంభోత్సవాలకు మై స్టాంప్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రూ.300 చెల్లిస్తే రూ.60 విలువైన 12 పోస్టల్ స్టాంప్‌లను దరఖాస్తు చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే అందజేస్తామని తెలిపారు.