అప్పుడు కాదని..ఇప్పుడు ఔనని
- బాక్సైట్‌పై మాట మార్చిన సీఎం బాబు
- నాడు వ్యతిరేకించి నేడు పచ్చజెండా
- సీఎం వ్యాఖ్యలపై నిరసన
- మళ్లీ పోరుకు సన్నాహాలు
సాక్షి,విశాఖపట్నం: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల తేనెతుట్టె మళ్లీ కదిలింది. ఇప్పటివరకు తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న గిరిజనులు,పర్యావరణకారులను కాదని తమ ప్రభుత్వం వీటిని తవ్వితీస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో నిరసనలు మిన్నంటుతు న్నాయి. ఒకరకంగా బాబు బాక్సైట్ నిల్వలపై ద్వంద్వ వైఖరిని చాటుకున్నట్లైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి, ఉద్యమాలు చేయించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే సీఎం హోదాలో ఏకంగా తవ్వకాలు చేపట్టడానికి నిర్ణయించినట్లు ప్రకటించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. గిరిజనుల బతుకులకు, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతాయనే సాకుతో ప్రతిపక్షంలో ఉండి తవ్వకాలను అడ్డుకోగా, ఇప్పుడు తమ ప్రభుత్వం వీటిని తవ్వితీస్తుం దని ప్రకటించడంతో గిరిజనులు మండిపడుతున్నారు.
అపారమైన నిల్వలు..
ఏజెన్సీ బాక్సైట్ ఖనిజ నిల్వలకు పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్‌టన్నులు, గూడెంలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అప్పట్లో నిపుణులు వెల్లడించారు. లక్షలకోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు. అప్పటి సీఎం వైఎస్ కొన్ని కంపెనీలకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు. పర్యావరణానికి విఘాతం అంటూ విమర్శలు వచ్చాయి. దీనికి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అడ్డం తగిలి ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు.
గిరిజనుల బతుకులను సమాధి చేయవద్దని కపట ప్రేమ నటించారు. తీరా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వ్యక్తి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేసి తీరుతామని చెప్పడంతో ఇప్పుడు రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి వీటి తవ్వకం వలన జలాశయాలు దెబ్బతిని మైదాన ప్రాంతంలోని నదుల్లోని నీటి ప్రవాహం తగ్గిపోతుంది. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి.
గిరిజనుల బాగుకోసం కాదు.. బడా కంపెనీల మేలుకే : శర్మ
బాక్సైట్ తవ్వకాలు చేపడితే నీటివనరులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జలాశయాలు దెబ్బతింటాయి. ఖనిజం తవ్వకాల వలన గిరిజనుల జీవనంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఐటీడీఏ మైనింగ్ బాధ్యత ఇస్తే దానిపేరుతో మళ్లీ ప్రైవేటు కంపెనీలు రెచ్చిపోతాయి. బాక్సైట్‌ను తవ్వడం వలన ప్రైవేటు వ్యాపారులకు కోట్లకుకోట్ల ఆదాయం వస్తుంది. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి వచ్చేది చాలా తక్కువ. సీఎం చెబుతున్నట్లు మైనింగ్ వలన గిరిజనులకు ఆదాయం పెరగదు. కేవలం జిందాల్,అన్‌రాక్ కంపెనీలకు భారీగా లాభాలు కట్టబెట్టేందుకే బాబు గిరిపుత్రులపై ప్రేమ చూపుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా నాతో మాట్లాడి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిద్దాం అని చెప్పి ఇప్పుడు సీఎం అయ్యాక ఉద్దేశం మార్చుకోవడం సబబు కాదు. మరోవైపు ఏజెన్సీలో బాక్సైట్ తవ్వాలంటే పీసా చట్టం అడ్డం వస్తుంది. గ్రామ పంచాయతీల తీర్మానం లేకుండా ఈ పనిచేస్తే చట్టాలను ఉల్లంఘించినట్లే.
తవ్వితే ఊరుకోం: ఎమ్మెల్యే ఈశ్వరి
పాడేరు: ఏజె న్సీలో బాక్సయిట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి హెచ్చరించారు. బాక్సయిట్ తవ్వి గిరిజనుల సంక్షేమానికి వినియోగిస్తామన్నడం చట్టవిరుద్ధమన్నారు. పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న బాబు బాక్సయిట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని.. అధికారం చేపట్టగానే గిరిజనుల సంపదను దోచుకునే ప్రయత్నాలు దారుణమన్నారు.
మాట మార్చిన బాబు: సీపీఎం
విశాఖపట్నం: జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు బాక్సైట్‌ను తవ్వుతామని చెప్పడాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండించింది. నిన్నటి వర కు బాక్సైట్‌ను వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు తన వైఖరి మార్చుకోవడం శోచనీయమని రాష్ట్ర కా ర్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్. నరసింగరావు తెలిపారు.