- అసెంబ్లీలో వాణి వినిపించిన పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి
- సానుకూలంగా స్పందించిన మంత్రి సిద్ధా రాఘవులు
విశాఖపట్నం : జిల్లా ఏజెన్సీలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీకి దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జీరో అవర్‌లో ఆమె తన వాణి వినిపించారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు లేకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని పేర్కొన్నారు. రవాణా సదుపాయాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచినా మావోయిస్టుల భయంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని వివరించారు.
కొంతమంది ముందుకొచ్చినప్పటికీ మావోయిస్టుల హెచ్చరికలతో మధ్యలోనే పనులు నిలిపివేసి వెళ్లిపోతున్నారని చెప్పారు. ఏజెన్సీలో ప్రధానంగా జి.కె.వీధి మండలంలో రోడ్లు లేకపోవడంతో రవాణా సదుపాయాలకు అవకాశం లేకుండా ఉందన్నారు. ఏజెన్సీలో రోడ్ల నిర్మాణాలకు టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఫలితంగా స్థానిక కాంట్రాక్టర్లు అయినా రోడ్ల నిర్మాణాలకు ముందుకు వస్తారన్నారు.
చింతపల్లి, వంజంగి, కోరుకొండ, బోరాడ గ్రామాలకు రోడ్లు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే రోడ్లు సదుపాయాలు ఉన్న గ్రామాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచించారు. ఎమ్మెల్యే ఈశ్వరి సూచనలకు ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ మంత్రి సిద్ధారాఘవులు సానుకూలంగా స్పందించారు. ఆమె ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.