మాదాపురంలో నిర్వాసితుల సమస్యలు ఆలకిస్తున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి, కమిటీ సభ్యులు
గిరిజనం కదలి వచ్చారు. తమకు జరిగిన అన్యాయంపై విచారణాధికారికి ఆధారాలతో సహావినతిపత్రాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఐటీడీఏ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోలేదు.
హైకోర్టు స్పందించి విచారణ కమిటీ ఏర్పాటు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్ననమ్మకంతో గిరిజనులు పెద్ద ఎత్తున ఐటీడీఏకు తరలి వచ్చారు.
జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కుక్కునూరు, జీలుగుమిల్లి, ఏలూరు మెట్రో:శక్తి స్వచ్ఛంద సంస్థ కోర్టులో వేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు విచారణ అధికారిని నియమించిన నేపథ్యంలో మంగళవారం కేఆర్‌పురం ఐటీడీఏలో జరిగిన విచారణకు విలీన మండలాల నుంచి పలువురు గిరిజనులు హాజరై తమ సమస్యలను విచారణ అధికారికి విన్నవించుకున్నారు. గిరిజన సంఘాల,వామపక్షాల, న్యాయవాద, ప్రజాసం«ఘాల నేతలు పెద్ద ఎత్తున బాధితులను వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. వారందరూ తమకు జరిగిన అన్యాయం గురించి విచారణాధికారికి మొరపెట్టుకున్నారు. ఈ అన్యాయానికి ఐటీడీఏ పీవో షాన్‌మోహన్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ కారణమని, వారిపై విచారణ జరిపించాలని గిరిజనసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
తెలుగుదేశం నాయకులు కాకర్ల సురేష్, సోమసుందరంకు అనుకూలంగా అధికారులు వ్యవహరించారని వారు ఆరోపించారు. పొలాల్లో ఉన్న చెట్లు, పంటలకు సంబంధించిన పరిహారాన్ని కొందరి ఖాతాల్లో మాత్రమే వేశారని, ఎక్కువగా బ్రోకర్ల ఖాతాలలో వేసి వారి వద్ద కమీషన్లు తీసుకుని మిగిలిన సొమ్ములు తమకు ఇచ్చారని బాధితులు ఆరోపించారు. గిరిజనులే కాకుండా నష్టపోయిన గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో ఐటీడీఏకు తరలి వచ్చారు. అయితే తాము గిరిజనులకు జరిగిన అన్యాయంపైనే కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నందున మిగిలిన వారి నుంచి వినతులు తీసుకోలేమని విచారణాధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. ముంపు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తరలి వస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment