
ఏలూరు జిల్లా జైలు, డైరెక్టర్ల కోసం జైలు లోపలికి బ్యాగులు తీసుకెళ్తున్న వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేతులు కట్టుకుని మరీ సేవలందించే సిబ్బంది, కోరుకున్న భోజనం, తాగేందుకు మినరల్ వాటర్, మెత్తటి పరుపులపై పడక, కాలక్షేపానికి దినపత్రికలు. ఒక్కటేమిటి ఏది కోరుకుంటే అది నిమిషాల్లో సిద్ధం. ఇవన్నీ.. దేశవ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా ప్రజలకు రూ.6 వేల కోట్లకు పైగా టోకరా వేసిప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో ఉన్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు పొందుతున్న రాచమర్యాదలంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. కానీ పచ్చి నిజం. కోర్టు కాదన్నా.. జైల్లో సైతం ఇలా విలాసవంతంగా గడిపేందుకు ఒక్కొక్కరు నెలకు రూ.50 వేల చొప్పున జైలు అధికారులకు ముట్టజెబుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. పలు కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ డైరెక్టర్లు జామీను చూపించకుండా జైల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో 8 మంది డైరెక్టర్లు రెండేళ్లుగా ఏలూరు సబ్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ తెరపైకి వచ్చినందున వేరే జైలులో ఉన్న మరో ఇద్దరిని కూడా ఏలూరు జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే జైల్లో ఉన్న చైర్మన్ సహా అగ్రిగోల్డ్ డైరెక్టర్లు సకల సౌకర్యాలూ అనుభవిస్తున్నారని, అధికారులు సాధారణ బ్యారక్‌ను వీఐపీ బ్యారక్‌లా మార్చేశారనే సమాచారం నేపథ్యంలో.. ‘సాక్షి’ బృందం గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై నిఘా వేసింది. ఈ క్రమంలో పలు వీడియోలు సాక్షికి చిక్కాయి.
కోర్టు కుదరదన్నా..ప్రత్యేక ఏర్పాట్లు
అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు జైల్లోని నాలుగో నంబర్ బ్యారక్‌ను కేటాయించారు. ఇది మిగతా అందరు రిమాండ్ ఖైదీలు ఉండే సాధారణ బ్యారక్ లాంటిదే. కానీ దాన్నిప్పుడు మిగతా ఖైదీలందరూ వీఐపీ బ్యారక్ అంటున్నారు. తమకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటూ డైరెక్టర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారు జైలు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో మిగతా అందరు ఖైదీల్లా వీరు ఏ పనీ చేయరు. ఉదయాన్నే జైలు ఆవరణలో కుర్చీలు వేసుకుని కూర్చుని దినపత్రికలు చదువుతుంటారు. వార్డర్లు వారి ముందు చేతులు కట్టుకు నుంచుని వారు చెప్పేది వింటుంటారు. వారు ఏది అడిగితే అది క్షణాల్లో సమకూరుస్తారు. ఇక బ్యారక్‌లో వారికి కావాల్సిన అన్నిరకాల సామగ్రి అందుబాటులో ఉంది. కిచెన్ వార్డర్ వీరి కోసం ప్రత్యేకంగా భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైన వంట పాత్రల్లో ప్రత్యేకమైన మెనూతో వంటకాలు వండి వడ్డిస్తున్నారు. సన్న బియ్యంతో అన్నం వండుతున్నారు. ప్రత్యేకంగా వాటర్‌బబుల్స్ (20 లీటర్ల క్యాన్లు) ద్వారా మంచి నీటిని అందజేస్తున్నారు. ఆదివారం మాత్రం ఇంటి భోజనం వస్తుంది.
అందుబాటులో అగ్రిగోల్డ్ ఉద్యోగి
వీరికి కావాల్సినవి బయట నుంచి తెచ్చి ఇచ్చేందుకు, వారికి కావాల్సిన సేవలు అందించేందుకు శేషగిరిరావు అనే అగ్రిగోల్డ్ ఉద్యోగి ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు ప్రాంగణంలోనే ఉంటున్నారు. జైలు సిబ్బందికి అతను ప్రత్యేక అతిథి. కిచెన్ వార్డర్ డ్యూటీ జైలులో ఉన్న సిబ్బందికి షిఫ్ట్‌లలో వేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఒకే వ్యక్తి ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం జైలులో ఎవరికీ ప్రత్యేక ఇంటర్వ్యూలు, ములాఖాత్‌లు ఉండవు. అయితే అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు మాత్రం ఇక్కడ ప్రత్యేకం. డైరెక్టర్ల బంధువులు ఆదివారం మధ్యాహ్నం వాహనాల్లో జైలుకు వస్తారు. వీరితోపాటు వారు తెచ్చే లగేజీ, భోజనాలు అన్నింటినీ లోపలికి అనుమతిస్తున్నారు. రికార్డుల్లో ఎక్కడా ములాఖాత్‌కు అనుమతించినట్టు ఉండదు. ఇక వీరికి రోజూ రాత్రి పూట పడుకునేందుకు పరుపులు అందజేస్తున్నారు. జైలు సిబ్బంది ఇచ్చిన దుప్పట్లు కాకుండా సొంతంగా ఇంటి నుంచి తెచ్చిన దుప్పట్లు వినియోగిస్తున్నారు.
సూపరింటెండెంట్ ఫోన్ నుంచే వ్యవహారాలు
జిల్లా జైలు సూపరింటెండెంట్ బి.చంద్రశేఖర్ ఫోన్ నుంచే అగ్రిగోల్డ్ డైరెక్టర్లు అన్ని కార్యాలూ చక్కబెట్టుకుంటున్నారు. అవసరమైన వారితో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నారు. జైలులో ఉండే రిమాండ్ ఖైదీల కోసం వొడాఫోన్ బాక్స్ ఒకదానిని ఏర్పాటు చేశారు. ఎవరైనా ఈ ఫోన్ నుంచే బయట వారితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఈ ఫోన్‌ను అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాల్లేవు.
కార్యాలయమే బెడ్‌రూమ్
నాలుగు నెలల క్రితం అగ్రిగోల్డ్ చైర్మన్‌కు అనారోగ్యం కారణంగా నిమ్స్‌లో చికిత్స అందజేశారు. అక్కడ గుండెకు ఒక స్టంట్ వేసినట్లు సమాచారం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత సుమారు వారం రోజులపాటు ఆయనకు జైలు సూపరింటెండెంట్ గది (ఏసీ గది)లోనే రాత్రి పూట నిద్రపోయే ఏర్పాట్లు చేశారంటే అక్కడ ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సూపరింటెండెంట్‌తో పాటు సీనియర్ జైలర్, కిచెన్ వార్డర్, గేట్ కీపర్, సూపరింటెండెంట్ డ్రైవర్ తదితరులు అగ్రిగోల్డ్ డైరెక్టర్ల సేవలో తరిస్తున్నట్టు సమాచారం. సూపరింటెండెంట్ డ్రైవర్ విజయవాడ వెళ్లి డబ్బులు వసూలు చేసుకురావడం వంటి కార్యక్రమాలు సైతం చేస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment