కాకి లెక్కలు కుదరవ్‌! | Public announcement and prepares to receive objections on margadarsi | Sakshi
Sakshi News home page

కాకి లెక్కలు కుదరవ్‌!

Published Thu, Apr 11 2024 5:44 AM | Last Updated on Thu, Apr 11 2024 5:44 AM

Public announcement and prepares to receive objections on margadarsi - Sakshi

మార్గదర్శికి తేల్చి చెప్పిన ‘సుప్రీం కోర్టు’

డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించేశామన్న రామోజీ

తమ ఆడిటర్లు లెక్కలు తేల్చేశారంటూ వాదన

మీ సొంత ఆడిటర్లు చెబితే చెల్లదు..

అది ధ్రువీకరించాల్సింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలేనన్న సుప్రీం

బహిరంగ నోటీసు ఇవ్వనున్న ఇరు ప్రభుత్వాలు

డిపాజిటర్ల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సన్నద్ధం  

సాక్షి, అమరావతి: ‘నేరం నాదే..! దర్యాప్తు నాదే..! తీర్పూ నాదే..!’ అంటూ మొండికేస్తున్న ఈనాడు రామోజీకి సుప్రీంకోర్టు గట్టి మొట్టికాయలు వేసింది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి డిపాజిట్‌దారులకు చెల్లించేశామని, తమ ఆడిటర్లు ఈ లెక్కలు తేల్చేశారంటూ నమ్మబలుకుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది.

ఆ విషయాన్ని నిర్దారించాల్సింది మార్గదర్శి ఆడిటర్లు కాదని, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ధ్రువీకరించాలని తేల్చి చెప్పింది. దీంతో రామోజీ గొంతులో పచ్చి వెలగకాయ పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు బహిరంగ ప్రకటన జారీ చేసి అభ్యంతరాలు స్వీకరణకు సన్నద్ధం కానుండటం రామోజీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.   

చెల్లించేశాం.. లెక్క తేల్చేశాం: రామోజీ వితండవాదం 
ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన కేసులో చెరుకూరి రామోజీరావు అడ్డగోలు వాదనలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. 2023 జూన్‌ 30 నాటికి 1,247 మంది డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని, కేవలం రూ.5.31 కోట్లు మాత్రమే అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు ఉన్నాయని ఆయన న్యాయవాదులు కోర్టుకు నివేదించారు.

ఈ విషయాన్ని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ ఆడిటర్లు క్షుణ్ణంగా ఆడిట్‌ చేసి నివేదిక సమర్పించారని, అన్ని లెక్కలు సరిపోయాయని చెప్పు­కొచ్చారు. అందువల్ల మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ డిపాజిట్‌దారులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని వితండవాదం చేశారు. తద్వారా మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో అక్రమంగా డిపాజిట్‌ చేసినవారి పేర్లు, ఆ డిపాజిట్‌ మొత్తాల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు రామోజీ ప్రయాస పడ్డారు. అక్రమ డిపాజిట్ల వెనుక భారీగా నల్లధనం దాగి ఉండటమే దీనికి కారణం. 

అదేం కుదరదు... నిగ్గు తేలాల్సిందే.. 
రామోజీ తరపు న్యాయవాదుల వాదనలను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. ‘డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు. మీ దగ్గర పని చేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేం’ అని స్పష్టం చేసింది. డిపాజిట్‌దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. ‘రూ.5 వేలు డిపాజిట్‌ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగలేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు.. అంతటి వ్యయ ప్రయాసలు భరించలేరు కదా..!’ అని వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్లు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఓ జ్యుడిషియల్‌ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 

బహిరంగ ప్రకటన.. 
అభ్యంతరాల స్వీకరణ సుపీం్ర కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట రామోజీ సేకరించిన అక్రమ డిపాజిట్లను సంబంధిత డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించారో లేదో పరిశీలించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లోనే డిపాజిట్‌దారులు అత్యధికంగా ఉన్నారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్‌ అధికారిని సంప్రదించి బహిరంగ ప్రకటన జారీ చేసేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేయనున్నాయి.

అగ్రిగోల్డ్‌  కేసులో మాదిరిగానే ఈ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. బహిరంగ ప్రకటన జారీ చేసి డిపాజిట్‌దారులకు సమస్యలుంటే నివేదించాలని కోరనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తారు. డిపాజిట్లు తిరిగి చెల్లించకుంటే ఆ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. వీటిని క్రోడీకరించి తదనుగుణంగా రాష్ట్ర  ప్రభుత్వాలు చర్యలు చేపడతాయి. ఇక రామోజీ డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్న వారి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఆ వివరాలను జ్యుడీషియల్‌ అధికారితోపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేయాలి.

వాటిని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ద్వారా  విడుదల చేస్తాయి. అందులోని డిపాజిట్‌దారుల పేర్లు, చెల్లింపుల వివరాలను పరిశీలిస్తాయి. వాటిపై వ్యక్తమయ్యే అభ్యంతరాలపై విచారణ చేపడతాయి. అనంతరం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నివేదికల ఆధారంగా జ్యుడీషియల్‌ అధికారి తదుపరి చర్యలు తీసుకుంటారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఆరు నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. ఇరు ప్రభుత్వాలు బహిరంగ నోటీసు ఇవ్వడంతో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు దిశగా వేగంగా చర్యలు చేపట్టాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement