‘అగ్రిగోల్డ్’ కేసులో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టీకరణ
డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ఉద్దేశాలకు విఘాతం కలిగించేలా.. వారికి నష్టం చేకూర్చేలా ఈడీ ఉత్తర్వులు
కానీ, సీఐడీ ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేలా ఉన్నాయి
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థించిన న్యాయస్థానం
అన్ని విషయాలను ప్రత్యేక కోర్టు ముందే తేల్చుకోవాలని ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీ జప్తుచేసి ఉండగా, తిరిగి అవే ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా జప్తుచేయడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్ట ఉద్దేశాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని.. పైగా డిపాజిటర్లకు కష్టం కలిగించేలా కూడా ఉన్నాయని స్పష్టంచేసింది. అందువల్ల ఈడీ ఉత్తర్వులను కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అదే సమయంలో సీఐడీ జప్తు ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉన్నాయని తేల్చిచెప్పింది.
అలాగే.. ‘డిపాజిటర్లందరూ ప్రధానంగా ఏపీకి చెందిన వారే. జప్తు ఆస్తులు కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. తమ కష్టార్జితాన్ని వారు డిపాజిట్ల రూపంలో కంపెనీలో పెట్టారు. తాము చెల్లించిన ఈ డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు మనీలాండరింగ్ చట్టం కింద అడ్జుడికేటింగ్ అథారిటీ వద్దకు వెళ్లి తేల్చుకోవడం డిపాజిటర్లకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ఏలూరులోని ప్రత్యేక కోర్టే ఈ మొత్తం వ్యవహారాన్ని తేల్చడం డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది. అందువల్ల ఈడీ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కొట్టెస్తున్నాం’.. అని న్యాయస్థానం పేర్కొంది.
అంతేకాక.. అగ్రిగోల్డ్ ఆస్తులను సీఐడీ జప్తుచేయడాన్ని ప్రత్యేక న్యాయస్థానం కూడా సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు సమర్థించింది. డిపాజిటర్లను మోసంచేసి కూడబెట్టిన భారీ ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన మొత్తాలను తిరిగి డిపాజిటర్లకు చెల్లించడమే డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ముఖ్యోద్దేశమన్న ప్రభుత్వ వాదనతో కూడా ఏకీభవించింది. అగ్రిగోల్డ్ కుంభకోణంపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని ఈడీకి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ఇటీవల తీర్పునిచ్చారు.
ఈడీ జప్తు ఉత్తర్వులపై పిటిషన్లు..
మరోవైపు.. అగ్రిగోల్డ్ నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆలిండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన వారూ అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్లను సైతం జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయా ఫ్లాట్ల యజమానులు కూడా పిటిషన్లు దాఖలు చేశారు.
రుణం ఇచ్చాం కాబట్టి, ఆస్తులను వేలంవేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు సైతం కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఈడీ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున పీఎస్‌పీ సురేష్‌కుమార్, పూజారి నరహరి, సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌లు వాదనలు వినిపించారు. అందరి వాదనలు విన్న కోర్టు గతేడాది ఆగస్టులో తీర్పు రిజర్వ్ చేశారు. ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ రవి ఈ వ్యాజ్యాలన్నింటిపై తన తీర్పును వెలువరించారు.
ఆస్తి జప్తు ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు..
‘జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లందరికీ సమానంగా పంచే అధికారాన్ని ప్రత్యేక కోర్టుకు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కల్పిస్తోంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్–6లో ఉన్న ఏ నిబంధన కూడా మనీలాండరింగ్ చట్టం సెక్షన్–5లో లేదు. జప్తుచేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు సమానంగా పంపిణీ చేయాలన్న నిబంధన ఏదీ కూడా మనీలాండరింగ్ చట్టంలో లేదు.
ఈ విషయంలో అడ్వొకేట్ జనరల్ వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. కేవలం ఆస్తి జప్తు చేయడం ద్వారా చట్టం ఉద్దేశం నెరవేరదు. ఆస్తి జప్తు బాధితులను రక్షించలేదు. ఈ కారణాలరీత్యా 2015లో సీఐడీ జప్తుచేసిన ఆస్తులను తిరిగి 2020లో ఈడీ జప్తుచేస్తూ జారీచేసిన ప్రాథమిక ఉత్తర్వులను కొట్టెస్తున్నా’.. అని జస్టిస్ రవి తన తీర్పులో పేర్కొన్నారు. ఆస్తుల జప్తునకు సంబంధించిన అన్నీ అంశాలను ఏలూరులోని ప్రత్యేక కోర్టు ముందే తేల్చుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment