కర్నూలు(రాజ్‌విహార్): ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడం తగదని యునెటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) రీజినల్ కార్యదర్శి నాగరాజు అన్నారు. నాలుగు రోజులుగా విద్యుత్ శాఖ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవన్ నుంచి కొత్త బస్టాండ్, బంగారుపేట, రాజ్‌విహార్, బుధవారపేల మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ ఎస్‌పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు యూఈఈయూ రీజినల్ కార్యదర్శి నాగరాజు మద్దతు తెలిపి మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్లోబల్ టెండర్లను రద్దు చేయాలన్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని ఎత్తేసి సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అప్పటి వరకు పనికి తగిన వేతనం చెల్లించాలన్నారు. ధర్నాలో కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా నాయకులు చంద్రశేఖర్, శరత్‌కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
పదండి ముందుకు..
Published Sat, Dec 20 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement