
రాస్తారోకో చేస్తున్న ఎరిగేరి గ్రామస్తులు (ఇన్‌సెట్లో) విద్యుదాఘాతంతో మిద్దెపైనే మృతి చెందిన వడ్డే మహదేవి
కర్నూలు, కౌతాళం రూరల్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలైంది. ఈ ఘటన కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామంలో ఇళ్లను ఆనుకుని 11 కేవీ విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. వీటిని తొలగించాలని గ్రామస్తులు అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులను కోరారు. వారు ఏమాత్రమూ పట్టించుకోలేదు. గురువారం ఉదయం వడ్డే మహదేవి(33) అనే గర్భిణి శ్రావణ మాసం సందర్భంగా ఇంటికి సున్నం వేసేందుకు మిద్దెపైకి వెళ్లింది. గోడలకు సున్నం కొడుతుండగా ఇంటిపై వేలాడుతున్న విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు ఆమె మెడకు తగలడంతో షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులు గమనించి మిద్దెపైకి వెళ్లి చూసేలోపే ఆమె చనిపోయింది. మహదేవికి ఇప్పటికే ముగ్గురు సంతానం కాగా.. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. ఆమె భర్త వడ్డే రామాంజులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గ్రామస్తుల ఆందోళన
గర్భిణి మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక ఆదోని ప్రధాన రహదారిపై మూడు గంటలకు పైగా రాస్తారోకో చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రావణమాస ఉత్సవాలకు వచ్చిన ఉరుకుంద ఈరన్న స్వామిభక్తుల వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదోని తాలూకా సీఐ మురళీ, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తిమ్మయ్య తమ సిబ్బందితో వచ్చి గ్రామస్తులతో చర్చించారు. నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన విద్యుత్ శాఖ ఏఈ మద్దిలేటి వస్తే గానీ రాస్తారోకో విరమించేది లేదని వారు తెగేసి చెప్పారు. ఏఈని రప్పిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.
ఏఈపై కేసు నమోదు
విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నిండు గర్భిణి ప్రాణాలు పోవడానికి కారణమైన విద్యుత్‌శాఖ ఏఈ మద్దిలేటిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment