ఎయిడెడ్ టీచర్ల ఆన్‌లైన్ వేతనాలు | Aided teachers wages in online | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్ టీచర్ల ఆన్‌లైన్ వేతనాలు

Published Fri, Jan 17 2014 4:06 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM

Aided teachers wages in online

 మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాల చెల్లింపు ప్రహసనంగా మారింది. 2005 ఏప్రిల్‌లో ప్రభుత్వం 010 పద్దు ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు 162 నంబరు జీవో జారీ చేసింది. దీని ప్రకారం పంచాయతీరాజ్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ఆన్‌లైన్ ద్వారా పంపాలనే నిబంధన విధించారు.

అప్పట్లో విడుదల చేసిన జీవో ప్రకారం తాజాగా ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు  ఆన్‌లైన్ ద్వారానే వేతన బిల్లులు చెల్లించాలనే నిబంధన విధించారు. దీంతో వారికి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రతి మూడునెలలకోసారి ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది.  వాటిని ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియని పరిస్థితిలో ఆన్‌లైన్ ద్వారా వేతన బిల్లులు పంపడం, బిల్లులు అందజేసేందుకు నిర్దేశిత తేదీలను ప్రకటించటంతో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపుల్లో కష్టాలు ఎదురవుతున్నాయి.

 జిల్లాలో ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 450 ఉండగా.. వాటిలో 902 మంది ఉపాధ్యాయులు, ప్రాథమికోన్నత పాఠశాలలు 69 ఉండగా.. 326 మంది, ఉన్నత పాఠశాలలు 67 ఉండగా 580 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

 నెల దాటితే ఎరియరే..
 ఎయిడెడ్ ఉపాధ్యాయులు సిబ్బందికి వేతనాలు మంజూరు చేసే సమయంలో ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. డిసెంబరు నెలకు సంబంధించిన జీతం జనవరిలో మంజూరు కాకుంటే ఆ నెల జీతం ఎరియర్ కిందకు వెళ్లిపోతుంది. ఆన్‌లైన్ ద్వారా ఎయిడెడ్ ఉపాధ్యాయులు బిల్లులు పెట్టుకునేందుకు ప్రత్యేక తేదీలను ఖరారు చేసింది.

ఎరియర్ బిల్లులైతే ప్రతి నెల 3 నుంచి 11వ తేదీ వరకు, తిరిగి 18 నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఉంచాలని షరతు విధించారు. ఈ రోజుల్లో ట్రెజరీల్లో ఉన్న సర్వర్ పనిచేయకుంటే బిల్లులు పెండింగ్‌లో పడిపోతున్నాయి.

 మార్చిలోపు క్లియర్ అయ్యేనా..
 ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులకు నాల్గవ క్వార్టర్ కింద ప్రభుత్వం వేతనాన్ని విడుదల చేయాల్సి ఉంది. జనవరి నెల సగం పూర్తయింది. మార్చి నెలాఖరుకల్లా ప్రభుత్వం విడుదల చేసిన నగదును బిల్లులుగా మార్చుకోకుంటే ఆ నగదు మొత్తం వెనక్కి మళ్లే ప్రమాదం ఉంది.

ఆన్‌లైన్ పద్ధతిలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు వేతన బిల్లులు పంపాలనే నిబంధన, నిర్దేశించిన తేదీల్లో సర్వర్లు పనిచేయకపోవడం వంటి అంశాల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి కల్లా ఉపాధ్యాయులకు నవంబరు నెల నుంచి రావాల్సిన వేతనాలను చెల్లిస్తారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 ఉపాధ్యాయులకు ఇబ్బందే..
 2005 ఏప్రిల్‌లో ప్రభుత్వం విడుదల చేసిన 162 జీవో ప్రకారం ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ పద్ధతిలో వేతన బిల్లులను పంపాలనే ప్రతిపాదనతో ఉపాధ్యాయులు ఇక్కట్ల పాలవుతున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.సత్యనారాయణ చెబుతున్నారు. 010 పద్దు ద్వారా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తే ఆన్‌లైన్ పద్ధతిలో బిల్లులను పంపే ఆంశాన్ని అధికారులు పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement