అధికారం లేక బాబు ఏదేదో మాట్లాడుతున్నారు: అక్బరుద్దీన్
రాయలసీమ వెనకబడిందని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పడం.. దానికి హైదరాబాద్ నగరాన్ని తాను అభివృద్ధి చేసినంతగా వేరెవ్వరూ అభివృద్ధి చేయలేదని చంద్రబాబు సమాధానం ఇవ్వడంతో అసెంబ్లీలో గందరగోళం జరిగింది. చంద్రబాబు తీరుపై అక్బర్ మండిపడ్డారు. తొమ్మిదేళ్ల నుంచి అధికారం లేకపోవడంతో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని, ఆయన చేసిన అభివృద్ధికి ప్రజలే తమ ఓట్లతో సమాధానం ఇచ్చారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయనకు అధికారం వస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడటానికి చాలా ముందుగానే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని, అందుకే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి అంతా హైదరాబాద్కు వచ్చారని తెలిపారు. నిజాం కాలం నుంచి 400 ఏళ్లపాటు జరిగిన అభివృద్ధిని చంద్రబాబు మర్చిపోయారా అని నిలదీశారు. చంద్రబాబు పదే పదే మాట మారుస్తారని, మొదట్లో మతతత్వ బీజేపీతో చేతులు కలపడం తాము చేసిన చారిత్రక తప్పిదమని, ఇకమీదట ఎప్పుడూ వారితో చేతులు కలిపేది లేదని చెప్పినా, తర్వాత మాత్రం ఇప్పుడ మళ్లీ మోడీతో చేతులు కలిపి నవ్వుతున్నారని, అందుకే చంద్రబాబును ఎవరూ నమ్మరని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా లేచి సభలో తీవ్ర గందరగోళం సృష్టించారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. ఆ సమయంలో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి లేచి ప్రతిపక్ష నాయకుడు, ఇతర సభ్యులు సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. అయినా సభ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభ్యులను కూర్చోవాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదు.