
సాక్షి, అమరావతి : భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరింది. రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే.. దీంతో గురువారం భూమా అఖిలప్రియ, ఆమె సోదరి మౌనికా రెడ్డి, సోదరుడు బ్రహ్మానందరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి తరపున ఆయన, కుమార్తె ఏవీ జశ్వంతి రెడ్డి చంద్రబాబు సమక్షంలో సుదీర్ఘ చర్చలకు కూర్చున్నారు.
ఇరువర్గాలతో వేరువేరుగా చర్చలు జరిపిన చంద్రబాబు ఇరువురి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేదని సమాచారం. ఇరు వర్గాలు చంద్రబాబు ఎదురుగానే పరస్పర విమర్శలకు దిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భూమా నాగిరెడ్డి మరణానంతరం సుబ్బారెడ్డి తనదైన శైలిలో ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి అఖిల ప్రియా మండిపడ్డారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే ఏవీ సుబ్బారెడ్డికి తమ మద్దతు ఉంటుందని, కానీ ఇలాంటి చవకబారు రాజకీయాలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. అయితే పార్టీ కార్యక్రమాలపై దాడి చేయించడం ఏంటని ఏవీ సుబ్బారెడ్డి నిలదీశారు.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే రాజీనామాలకు సైతం వెనుకాడబోమని అఖిల ప్రియ హెచ్చిరించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. సుధీర్ఘంగా ఇరువురికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం మరోసారి చర్చలకు రావాలంటూ దీంతో ముఖ్యమంత్రి, ఇరువర్గాలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment