కడప అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి రావడంతో మద్యం వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు సీలింగ్ పద్ధతిని పెట్టారు. మరోవైపు దాడులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల సందర్బంగా అభ్యర్థులు 30 శాతం మద్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. అయినా జిల్లా వ్యాప్తంగా మద్యం సరఫరా కాకపోవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు ఈనెల మొదటి వారం నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు చేపట్టారు.
ఏకంగా రూ.17 కోట్ల మద్యాన్ని ఒకేరోజు జిల్లాలోని మద్యం వ్యాపారులు తరలించడంతో వారిపై ఆంక్షలు విధించారు. ఎన్నికల కమిషన్ నుంచి గత సంవత్సరం ఏ మేరకు మద్యం కొనుగోలు చేశారో నెలసరిగా అంతే మద్యాన్ని మద్యం వ్యాపారులకు ఇవ్వాలని, ఎక్కువగా మద్యం విక్రయించినా అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ మేరకు ఇటీవల జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్వయంగా మద్యం డిపోను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అప్పటికే మద్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. అయినప్పటికీ దాడులు ముమ్మరం చేయాలని, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఈనెల 3వ తేది నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన కేసుల వివరాలిలా ఉన్నాయి.
నాటుసారా కేసులలో ఇప్పటివరకు 31,125 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ట్రాక్టర్‌తోసహా ఐదు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్‌షాపుల కేసుల్లో 51.63 లీటర్ల బీరును స్వాధీనం చేసుకున్నారు. మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ దాడులన్నింటినీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సహాయ కమిషనర్ విజయకుమారి పర్యవేక్షణలో ఏఈఎస్ బాబుశ్రీధర్, సీఐలు మల్లారెడ్డి, తిరుపతయ్య, శివసాగర్ నిర్వహిస్తున్నారు.
‘బెల్ట్’ తీస్తున్నారు!
Published Thu, Mar 13 2014 2:36 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement