సంసారంలో సారా చిచ్చు | alcohol epidemic in the family | Sakshi
Sakshi News home page

సంసారంలో సారా చిచ్చు

Published Wed, Oct 16 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

alcohol epidemic in the family

అమరచింత, న్యూస్‌లైన్: మద్యం మహమ్మారి ఆ కుటుంబంలో చిచ్చురేపింది. నిత్యం తాగొచ్చి గొడవపడే భర్త వేధింపులకు తాళలేక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను విషమిచ్చింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆ ముగ్గురు మృతువుతో పోరాడి చివరికి ప్రాణాలు విడిచారు. దసరా పండుగ రోజున ఈ విషాదకర సంఘటన సోమవారం ఆత్మకూర్ మండలం కొంకనివానిపల్లి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల ఆంజనేయలు, సుజాత (28)లకు శివ(7), శిరీష(5)అనే ఇద్దరు సంతానం. భార్యాభర్తలు వ్యవసాయం చేస్తూ తమ పిల్లలను స్థానిక ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తూ ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇంతలో మద్యం రక్కసి వారి సంసారంలో మంటపెట్టింది.
 
 తాగుడుకు బానిసగా మారిన ఆంజనేయులు భార్యతో నిత్యం గొడవపడేవాడు. దీనికి తోడు తమ దాయాదులతో కలిసి తన మద్యం సేవించడాన్ని సుజాత జీర్ణించుకోలేకపోయింది. తమ కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ అవమానించే వారితో ఎలా కలిసుంటావని భర్తను పలుమార్లు హెచ్చరించింది.  
 
 అయినా ఆంజనేయులు ప్రవర్తనలో మార్పురాలేదు. ఇదిలాఉండగా గ్రామంలో దసరా వేడుకల్లో ఉత్సాహంగా గడిపిన సుజాత పండుగ రోజు భర్త మద్యం తాగిరావడం చూసి గొడవకు దిగింది. పరస్పరం దూషించుకున్నారు. మనస్తాపం చెందిన సుజాత సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను వెంటతీసుకుని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అక్కడే తన పిల్లల చేత పురుగుమందు తాగించి తానూ తాగింది. దీంతో వారు అపస్మారకస్థితికి చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు ముగ్గురిని ఆత్మకూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
 ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న సుజాత మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలువిడిచింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కొంకనివానిపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఇరు కుటుంబసభ్యులు పంచాయితీ పెట్టారు. రూ.3లక్షల నష్టపరిహారం చెల్లించాలని సుజాత బంధువులు డిమాండ్ చేయగా ఆంజనేయులు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఆత్మకూర్ పోలీస్‌స్టేషన్‌లో బాధిత బంధువులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ అబ్దుల్ రజాక్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement