మీరు.. మేము పంచుకుందాం
మద్యం ధరలకు రెక్కలు తెప్పించిన ఎక్సైజ్‌శాఖ
అధిక రే ట్లకు విక్రయించుకోవాల్సిందిగా ఆదేశాలు
మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్న వైనం
నెలకు రూ. కోట్లు దండుకుంటున్న యంత్రాంగం
కడప:మద్యం వ్యాపారులు అధిక ఆదాయమే లక్ష్యంగా ఏకమయ్యారు. జిల్లాలో మందుబాబుల జేబులకు వ్యూహత్మకంగా చిల్లులు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖ సమర్థవంతమైన పాత్ర పోషించింది. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘనకు పాల్పడ్డారు. అడ్డు చెప్పిన నాయకుల్ని సైతం మనీతో మాట్లాడకుండా చేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు అక్రమార్జన కోసం కొత్తపద్దతిలో అక్రమ ఆదాయానికి మద్యం వ్యాపారుల్ని ఏకం చేశారు. ఆదాయం పంచుకుందాం... అన్న రీతిలో మందుబాబుల జేబులకు చిల్లుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఎమ్మార్పీ రేట్లు ఉల్లంఘించినా చూసీచూడనట్లు ఉంటాం... మా వాటా మాకు పంపండి.. అని ఓ ఉన్నతాధికారి తెలియజేసినట్లు సమాచారం. ఇంకేముంది వెంటనే జిల్లాలో మద్యం రేట్లుకు రెక్కలు వచ్చాయి. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన నాయకుల్ని సైతం నోట్ల కట్టలతో కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు.
అధికరేట్లుకు మద్యం విక్రయాలు...
జిల్లాలో 269 మద్యం షాపులకు 209 టెండర్లులో దుకాణాలు కేటాయించారు. తక్కిన దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధల మేరకు మద్యం విక్రయాలు నిర్వహించాలని ముందుగా ఎక్సైజ్ యంత్రాంగం ఆంక్షలు పెట్టింది. ఆపై నెలమామూళ్లు కోసం పరితపిస్తోంటే మద్యం వ్యాపారులు తిరగబడ్డట్లు సమాచారం. ఇలా అయితే ఎలా.. మీరు ఆదాయం గడించడండి, మాకు ఇవ్వండని కొందరు అధికారులు మద్యస్థం చేశారు. దీంతో ఎమ్మార్పీ రేట్లుకు మంగళం పలికారు. ఉన్నత స్థాయి అధికారుల జోక్యం వల్ల ఇది ఓ కొలిక్కి వచ్చింది. దాంతో కడప కేంద్రంగా రూ.15 అధికంగాను, ప్రొద్దుటూరు కేంద్రంగా రూ.10 అధిక రేట్లుకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్కోక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్లు విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అధికంగా విక్రయించినా ఒక్కోక్క మద్యం షాపు నుంచి ప్రతినెలా సుమారు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరక ఆదాయం గడించే అవకాశం ఉంది. అందులో రూ.50వేలు మాత్రమే మాకు అప్పగించండని జిల్లా స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలు ద్వారా అధనంగా మందుబాబులు సుమారు రూ.12కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది.
అధికార పార్టీ నేతలు అడ్డగించడంతో....
అధిక రేట్లుకు మద్యం విక్రయాలు చేయడానికి అధికారపార్టీకి చెందిన నాయకులు కొందరు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లుకే మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారుల్ని, ప్రోత్సహిస్తోన్నారంటూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని బెదిరించడంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు కడప, ప్రొద్దుటూరులలో ఇరువురు నాయకులకు నెల మామూళ్లు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
డీప్యూటీ క మిషనర్ ఎమ్మన్నారంటే...
అధికరేట్లుకు మద్యం విక్రయాలపై దాడులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపులపై కేసులు నమోదు చేశాం. ఎమ్మార్పీ రేట్లు కంటే అదనంగా మద్యం విక్రయాలు ఉంటే సిబ్బందిపై సైతం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ విజయకుమారి పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధిక రేట్లుకు పోత్సహిస్తున్న విషయాన్ని ఎన్‌ఫోర్సుమెంటు డెరైక్టర్ సూర్యనారాయణరావుతో సంప్రదించగా అలా చేయడం నేరమని తెలిపారు. ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అధిక రేట్లుకు విక్రరుుంచే వ్యాపారులు, అందుకు సహకరిస్తోన్న బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.