
మద్యం విధానంపై పోరాడదాం
- స్త్రీవిముక్తి సంఘటన రాష్ట్ర మహాసభల్లో తీర్మానం
విజయవాడ, న్యూస్‌లైన్ : మహిళలపై హింస, నేరప్రవృత్తిని పెంచి పోషిస్తూ.. ప్రజల ఆదాయాన్ని కొల్లగొడుతున్న మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడదామని స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర మహాసభ తీర్మానించింది. స్థానిక జింఖానా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన స్త్రీ విముక్తి సంఘటన రాష్ర్ట మహాసభలు ఆదివారం ముగిశాయి.
ఈ సందర్భంగా కందుకూరి కల్యాణమండపంలో స్త్రీవిముక్తి సంఘటన ప్రతినిధుల సభ జరిగింది. ప్రొఫెసర్ జ్యోతిరాణి మాట్లాడుతూ మద్యం ఆదాయాల మీద ఆధారపడి ప్రభుత్వాలను నడపడం సిగ్గుచేటన్నారు. కొత్తప్రభుత్వాలు మద్యం ఉత్పత్తులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ప్రజలను ప్రభుత్వాలపై ఆధారపడే విధంగా చేస్తున్నాయే తప్ప స్వావలంబన దిశగా తీసుకెళ్లడం లేదన్నారు.
మహిళా సాధికారత కోసం రూపొందించిన పథకాలు పేదలను మరింత పేదలుగా మారుస్తున్నాయన్నారు. రచయిత్రి కాత్యాయని మాట్లాడుతూ పాలకుల విధానాలు ప్రజల్ని సంఘటితం కాకుండా వ్యక్తులుగా విడగొట్టేందుకు దోహదం చేస్తున్నాయన్నారు. సినిమా, టీవీ కార్యక్రమాల్లో స్త్రీలను కించపరిచి, హీనంగా చిత్రీకరించే దృశ్యాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం 19 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవం తీర్మానించింది. స్త్రీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను వ్యతిరేకిస్తూ, విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. మహాసభల సందర్భంగా కళాకారుల ప్రదర్శించిన కళారూపాలు అలరించాయి.
నూతన కార్యవర్గం ఎన్నిక
మహాసభల అనంతరం సంస్థాగత కార్యక్రమాల సమావేశం జరిగింది. సంఘ కార్యదర్శి ఎం.లక్ష్మి నివేదికను ప్రవేశపెట్టారు. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్త్రీ విముక్తి సంఘటన ప్రధాన కార్యదర్శిగా ఎంలక్ష్మి (హైదరాబాద్), సహాయ కార్యదర్శిగా బి.అరుణ (కృష్ణా), అధ్యక్షురాలిగా సి.విజయ (కృష్ణా), ఉపాధ్యక్షురాలిగా ఎస్.లలిత (ప్రకాశం), కోశాధికారిగా వి.కొండమ్మ (నెల్లూరు) ఎన్నికయ్యారు. వీరితో పాటు 23 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మహాసభల్లో స్త్రీవిముక్తి సంఘటన ప్రతినిధులు ఎం.అమలేందు, టి.శ్రీదేవి, రమ తదితరులు పాల్గొన్నారు.