చుక్కకు లెక్కేలేదు! | Alcohol Prices Hikes In Bar And Restaurants Krishna | Sakshi
Sakshi News home page

చుక్కకు లెక్కేలేదు!

Published Sat, Jul 7 2018 1:03 PM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

Alcohol Prices Hikes In Bar And Restaurants Krishna - Sakshi

బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో మద్యం రేట్లు చుక్కల్లో ఉంటున్నాయి. నిర్వాహకులు అధిక ధరలు వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెడుతున్నారు. క్వార్టర్‌ మద్యంపై అదనంగా రూ.120 నుంచి రూ.150 వరకు పెంచి విక్రయిస్తున్నారు. బీరుపై అదనంగా రూ.70 వంతున తీసుకుంటున్నారు. బార్‌యజమానుల దోపిడీపై ఎక్సైజ్‌ శాఖకు ఫిర్యాదు వెళ్లినా పట్టించుకోవటం లేదు. బార్లలో ఎమ్మార్పీ ఉండదని అక్కడ సౌకర్యాలను బట్టి ధరలు నిర్ణయిస్తారంటూ అధికారులు దాట వేస్తున్నారు.

సాక్షి,అమరావతిబ్యూరో : ‘విజయవాడ మొగల్రాజుపురానికి చెందిన రాకేష్‌ తన స్నేహితులతో కలిసి  పాలిక్లీనిక్‌ రోడ్‌లోని దుర్గా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వెళ్లి బర్త్‌డే పార్టీ  చేసుకున్నారు. మొత్తం మీద ఆరు బీర్లు సేవించి ఎంజాయ్‌ మూడ్‌లో ఉన్నారు. కానీ బార్‌ సర్వర్‌ తెచ్చిన బిల్లు చూసి వారికి మద్యం కిక్కు దిగింది. బీరు ధర రూ.120 ఎమ్మార్పీ ఉంటే  రూ.190 వంతున బిల్లులో చూపారు. బిల్లు చూసి కిక్కు తగ్గిన రాకేష్‌  బాటిల్‌పై రూ.70 అదనంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తే ఇక్కడింతే బిల్లు కట్టి వెళ్లడంటూ సమాధానం ఇవ్వడంతో గత్యంతరం లేక బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఇది ఒక్క దుర్గా బార్‌లోనే కాదు జిల్లాలోని ప్రతి బార్‌అండ్‌ రెస్టారెంట్‌లలో కొనసాగుతున్న తంతే. మద్యం ప్రియులను దోచుకోవడమే ద్వేయంగా యజమానులు సాగిస్తున్న దందా ఇదీ ..

జిల్లాలో పరిస్థితి ఇదీ..!
కృష్ణా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్‌ యూనిట్ల పరిధిలో 336 మద్యం దుకాణాలు, 158 బార్లు ఉన్నాయి.. అందులో విజయవాడ యూనిట్‌ పరిధిలో 134 బార్లు, మచిలీపట్నం యూనిట్‌ పరిధిలో 24 బార్లు ఉన్నాయి. విజయవాడ నగరంలోని అధికంగా బార్లు ఉన్నాయి. గతంలో జిల్లాలో మద్యం మాఫియా నిబంధనలకు పాతరేసి ఇష్టానుసారంగా మద్యం ధరలు పెంచి అమ్మకాలు సాగించారు. వీధికో బెల్టు దుకాణాం ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు జరిపించారు.. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం బాధ్యతలు తీసుకొన్నాక నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన జరగకుండా  చర్యలు చేపట్టారు. ఎక్సైజ్‌ శాఖ నెలవారీ మామూళ్లకు గండిపెట్టడమే కాకుండా పోలీస్‌ శాఖకు మామూళ్లు వెళ్లకుండా అడ్డుకొనేందుకు ఏకంగా డీజీపీకి లేఖ రాశారు.  ఈ ఏడాది మద్యం పాలసీలో మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ దరలకే విక్రయాలు జరిపించేలాఆయన చేపట్టిన చర్యలు సక్సెస్‌ అయ్యాయి. కానీ బార్లలో మాత్రం దోపిడీకి అడ్డుకట్టవేయలేకపోయారు.

షాపుల మార్పునకు 40 దరఖాస్తులు
రహదారి నిబంధనలు సడలింపుతో పల్లెల్లో ఇళ్ల ముంగిటకే మద్యం దుకాణాలు వచ్చేస్తున్నాయి.. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన నిబంధనల విషయంలో న్యాయస్థానం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఎక్సైజ్‌ శాఖ దుకాణాల మార్పునకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోని రహదారుల సమీపంలోకి దుకాణం మార్చుకొనే వెసులుబాటు కలగడంతో పలువురు మద్యం దుకాణాల మార్పునకు దరఖాస్తులు చేసుకున్నారు. గతంలో మండల కేంద్రాలలో  రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి 220 మీటర్లు దూరంగా ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా మద్యం అమ్మకాలపై ప్రభావం పడుతుందని వైన్‌ యజమానులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రహదారుల మార్పు చేయించారు. తాజాగా న్యాయస్థానం ఇటీవల నిబంధనలు సడలిస్తూ తీర్పు ఇవ్వడం వారికి వైన్‌ యజమానులకు ఊరట కల్గింది. వెంటనే రహదారుల వెంబడి ఇళ్ల ముంగిటే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 40 దుకాణాలు మార్పుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ఇళ్ల ముంగిట దుకాణాలు ఏర్పాటుపై మహిళల్లో పెల్లుబుకిన ఆగ్రహం మళ్లీ చవిచూడాల్సి వస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
నగరంలోని  బార్లలో అధిక ధరలు విక్రయాలపై పరిశీలిస్తాం. బార్లలో సౌకర్యాలు ఏర్పాటుకు అనుగుణంగా ధరపెంచుకొనే వెసులు బాటు ఉంది. అలా అని ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తే చర్యలు తప్పవు.– రమణమూర్తి, ఏఈఎస్, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement