సాక్షి, గుంటూరు: ఎన్నో పచ్చని కుటుంబాలు మద్యం చిచ్చుకు నిలువునా కూలిపోతున్నాయి. దాంపత్య బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. వీటన్నింటినీ తన పాదయాత్రలో దగ్గరుండి చూసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే బెల్ట్ షాపుల రద్దు, ఎమ్మార్పీకే విక్రయాలు వంటి నిర్ణయాలతో ముందడుగు వేశారు. ఈ నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మద్యం దుకాణాల రెన్యువల్ విషయంలో జిల్లాలో 20 శాతం యజమానులు వెనుకంజ వేశారు.
దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మద్య నిషేధంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బెల్టుషాపుల నిర్మూలన, బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేసే మద్యం దుకాణాలపై కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలను సర్కార్ అమలులోకి తీసుకువచ్చింది. దీంతో జిల్లాలో విచ్చలవిడి మద్యం అమ్మకాలను అడ్డుకట్టపడింది. సమయపాలన కచ్చితంగా పాటించాలి, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.
20 శాతం తగ్గిన దుకాణాలు..
ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల కారణంగా జిల్లాలో మద్యం దుకాణాల్లో 20 శాతం మేర తగ్గాయి. గత నెల 30కి మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగిసింది. కొత్త మద్యం పాలసీ రూపలకల్పనకు కొంత సమయం పడుతుంటంతో ప్రభుత్వం మూడు నెలలు మద్యం దుకాణాల లైసెన్స్ రెన్యూవల్‌కు అవకాశం ఇచ్చింది.
జిల్లాలో 355 మద్యం దుకాణాలున్నాయి. జూన్ 30 నాటికి లైసెన్స్ రెన్యూవల్‌కు ప్రభుత్వం గడువు విధించగా 287 మద్యం దుకాణాల యజమానులు మాత్రమే లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్నారు. మిగిలిన 68 దుకాణాల నిర్వాహకులు ముందుకు రాలేదు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కారణంగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తగ్గిన మద్యం అమ్మకాలు..
ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల జిల్లాలో మద్యం అమ్మకాలు సైతం తగ్గుముకం పట్టాయి. సార్వత్రిక ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పాటై మద్యం అమ్మకాలపై నిబంధనలు కఠినతరం చేయడంతో జూన్ నెలకు ముందు జరిగిన అమ్మకాలతో పోల్చుకుంటే సుమారు రూ.20 కోట్లకు పైగా తగ్గాయి. జూన్ నెలలో రూ.149.66 కోట్ల మద్యం విక్రయాలు జరిగగా.. ఇక ముందు కూడా విక్రయాలు మరితం తగ్గుతాయని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
జిల్లాలో మద్యం దుకాణాలు | 355 |
లైసెన్సులు రెన్యువల్ చేయించుకున్న షాపులు | 287 |
జూన్‌లో మద్యం అమ్మకాలు | రూ.149 కోట్లు |
గత ఏడాది జూన్‌లో మద్యం అమ్మకాలు | రూ.170 కోట్లు |
ఒక్క నెలలో తగ్గిన అమ్మకాలు | రూ.21 కోట్లు |
Comments
Please login to add a commentAdd a comment