
జెండాలు.. అజెండాలు పక్కన పెట్టాలి
ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ‘ప్రత్యేక హోదా సాధన’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో జెండాలు- అజెండాలు పక్కన పెట్టి అందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
మోడీపై పోరాడే సత్తా బాబుకు లేదు: సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడుతూ, మోదీపై పోరాడే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ఇంటి వద్ద ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధర్నా చేయాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నారు.
టీడీపీ మంత్రులను వెనక్కి పిలవాలి: చెవిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర మంత్రులను వెనక్కి పిలిస్తే.. కేంద్రం దిగొస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు చంద్రబాబుతో కలసి వస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయనడం పచ్చి అవకాశదానికి నిదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఏపీ విద్యార్ధి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ కృష్ణాయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ నటుడు శివాజీ, కాంగ్రెస్ నాయకులు తులసీరెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
సదస్సులో చేసిన తీర్మానాలు: ఈ నెల 31న నెల్లూరులో విస్తృత స్థాయి సమావేశం, జూన్ 2న రాష్ట్ర విభజన దినం సందర్భంగా నల్ల రిబ్బన్, నల్ల జెండాలతో నిరసన, 3వ తేదీన ఎంపీలు, కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద ధర్నా, 4వ తేదీన అనంతపురంలోని ఎస్కే వర్సిటీ ప్రాంగణంలో విస్తృత స్థాయి సమావేశం, 5వ తేదీన నాగార్జున వర్సిటీలో విద్యార్థి జేఏసీ సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ.