
అఖిలపక్షం వల్ల ఒరిగేదేమీ ఉండదు: జేపీ
ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం.. ఆ అంశంపై కేంద్రం ఆడుతున్న అవకాశవాద నాటకంలో మరో అంకమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అభివర్ణించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం.. ఆ అంశంపై కేంద్రం ఆడుతున్న అవకాశవాద నాటకంలో మరో అంకమేనని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో పార్టీలన్నీ ప్రాంతాలవారీగా విడిపోయిన నేపథ్యంలో మరోసారి వాటితో సంప్రదింపులు జరపడం వల్ల ఫలితం ఉండదన్నారు.
రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలతో, మూడు ప్రాంతాల జేఏసీలు సహా వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో వేరువేరుగా చర్చలు జరపాలని సూచించారు. అవసరమైతే జిల్లాలవారీగా కూడా కూర్చోబెట్టి సంప్రదింపులు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.