కడప ఎడ్యుకేషన్ : నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 44, 728 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల్లో బల్లులు, తాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 15 నిమిషాలు ముందుగా సెంటర్లకు చేరుకోవాలని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని జిల్లా ఇంటర్మీడియేట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రసాద్‌రావు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్ స్క్వాడ్‌తోపాటు ఐదు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 92 మంది సూపర్ వైజర్లు, 92 మంది డిపార్టుమెంటల్ అధికారులతోపాటు రాష్ట్ర పరిశీలకులు, హైపవర్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలపై జీపీఎస్ సిస్టమ్ ఆన్‌లో ఉంటుందని.. ఇన్విజిలేటర్లు, సూపర్‌వైజర్లు, స్వ్కాడ్ బృందాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను జీపీఎస్ నిర్వాహకులకు అందజేశామని చెప్పారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలు
పరిశుభ్రమైన , ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సమయానికి తినటం, నిద్రించటంతోపాటు మంచి విషయాలను మాత్రమే ఆలోచించాలి. ఇలా చేస్తే శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగం. పరీక్షల సమయంలో షోషక పదార్థాల పాత్ర కీలకం. పళ్లు, పళ్ల రసాలు చాలా అవసరం.
స్వీట్లు, చాక్లెట్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు. చదవడం ప్రారంభించే ముందు ఒక లవంగం, లేదా యాలుక పలుకు బుగ్గన పెట్టుకుంటే మంచిది. ఆలోచన ఎటో వెళ్లినప్పుడు దాన్ని ఒకసారి కొరకాలి. చదువు మధ్యలో ఒకసారి పంచదార కలపని పళ్లరసం, గంట తరువాత సోయాబీన్ కలిసిన మజ్జిగ తాగితే నిద్ర మత్తు ఉండదు. పైగా శక్తి వస్తుంది.
సాత్విక అహారం తీసుకోవాలి. పరీక్షల సమయంలో మాంసాహారం తింటే.. దాన్ని జీర్ణం చేయడానికి అక్సిజన్ ఎక్కువగా అవసరం అవుతుంది. దీంతో మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక నిద్ర వస్తుంది. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్సు, రాత్రి 7 గంటలకు భోజనం చేసి 10 గంటల సమయంలో పాలు తాగాలి.
అహారంలో మసాలాలు లేని కూరలు తినాలి. టిఫిన్, బోజనానికి మధ్యలో బిస్కెట్ లాంటివి తీసుకోవాలి. కనీసం 6 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. మెదడును ఒత్తిడికి గురి చేయకుండా మధ్య మధ్యలో విశ్రాంతినిస్తూ చదవాలి. ఉదయం పది నిమిషాల పాటు చిన్న పాటి వ్యాయామాలు చేయాలి. తరచూ మంచి నీళ్లు తీసుకోవాలి. రోజుకొక అరటి పండు తింటే ఏకాగ్రత పెరుగుతుంది.
ఆల్ ది బెస్ట్..
Published Wed, Mar 11 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement