సాక్షి, పశ్చిమ గోదావరి : తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 19లక్షల 50వేల అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం, పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో దోచుకున్నది చాలక పేద ప్రజలకు సంబంధించిన అగ్రిగోల్డ్‌లోనూ ప్రభుత్వ పెద్దలు దోచుకోవటం సిగ్గుచేటని విమర్శించారు.
అగ్రిగోల్డ్ అప్పులకన్నా ఆస్తులు ఎక్కువగా ఉన్నా.. బాధితులకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయటం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వ పెద్దలు కాజేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా విమర్శలు వస్తున్నా చంద్రబాబు ఎందుకు స్పందించటంలేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు దోచుకోవటంలో ఉన్న శ్రద్ధ బాధితులకు న్యాయం చేయాలని లేకపోవటం దురదృష్టకరమన్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలనే ప్రయత్నం : వైఎస్సార్ సీపీ నాయకులు
విజయవాడ : అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్సార్ సీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలోనే అగ్రిగోల్డ్‌కు రూ. వెయ్యికోట్ల ఆస్తులు ఉన్నాయని అన్నారు. ఐదు నిమిషాల్లో పరిష్కరించే సమస్యను ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment