చిత్తూరు(జిల్లాపరిషత్), తిరుపతి అర్బన్/లీగల్, న్యూస్‌లైన్ : తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. వివిధ వర్గాల జేఏసీలు, నాయకుల నుంచి ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రపతి అయినా తెలుగు ప్రజల ఆత్మఘోషను అర్థం చేసుకుని రాష్ట్ర విభజన ప్రక్రియకు పుల్‌స్టాప్ పెట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.
సీమాంధ్రుల జీవితాలతో ఆడుకోవద్దు
కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రుల జీవితాలతో ఆడుకుంటోంది. గత సంవత్సరం జూలై 30న రాష్ట్ర విభజనపై ప్రకటన వచ్చినప్పటి నుంచి సీమాంధ్ర అట్టుడుకుతోంది. ఇదేమీ పట్టించుకోకుండా కేంద్రం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీసేందుకు ముందుకెళ్లడం సరికాదు. సమ్మెలోకి దిగిన ఏపీ ఎన్‌జీవోలు శనివారం నుంచి నిరసన కార్యక్రమాలు మరింత ఎక్కువ చేస్తారు.
- కృష్ణమనాయుడు, ఏపీ ఎన్‌జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఎన్నిక నేపథ్యంలో స్పీడ్ పెంచింది
ఎన్నికలు సమీపిస్తున్నందునే విభజనపై కేంద్రం స్పీడ్ పెంచింది. అసెంబ్లీలో బిల్లు తిప్పి పంపామని జబ్బలు చరుస్తున్న నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు. కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్న నేతలు నిశ్శబ్దంగా సమావేశాల్లో కూర్చొని వస్తున్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ నాశనం చేస్తోంది.
- రెడ్డిశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేత
తెలుగు ప్రజలంటే విశ్వాసం లేదు
తెలుగు ప్రజలు రెండు దఫాల పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కిస్తే ఇప్పుడు వారిపై విశ్వాసం లేకుండా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి విలువ లేకపోవడం దారుణం. కేంద్రం నిరంకుశ విధానానికి శుక్రవారం కేబినెట్ ఆమోదమే తార్కాణం.
- డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, జేఏసీ కన్వీనర్,తిరుపతి
పోరాటాలు తీవ్రతరం
తెలుగు ప్రజల అభిప్రాయాన్ని ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్న కేంద్రప్రభుత్వంపై పోరాటాలు తీవ్రతరం చేయడానికి అన్ని జేఏసీలతో కలసి ముందుకు సాగుతాం. రాష్ట్ర విభజన ప్రక్రియపై ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో మన ప్రాంతానికి చెందిన ఒక్కరూ లేకపోవడం విడ్డూరం. విభజన అంశంలో రాష్ట్రపతి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం.
- డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మెడికల్ జేఏసీ జిల్లా చైర్మన్
ఇది తెలుగువారి ఆత్మఘోష
విభజన ప్రక్రియపై తెలుగువారి ఆత్మఘోషను ఢిల్లీ పెద్దలు పరిగణనలోకి తీసుకోలేదు. సీమాంధ్రనాయకులు ఢిల్లీ పెద్దలకు తాకట్టయ్యారు. మన ప్రాంత నాయకుల ఉదాసీనత, ప్యాకేజీల కక్కుర్తి వైఖరి వల్లే కేంద్రం మొండిగా ముందుకెళుతోంది. విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది. సీమాంధ్ర కూడా వెనుకబాటుకు గురైందన్న విషయాన్ని ఏ ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవడంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వెంటనే విభజన ప్రక్రియను ఆపాలి.
- డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతి, ఐఎంఏ ఉపాధ్యక్షురాలు
టీ బిల్లుపై ఆగ్రహ జ్వాల
Published Sat, Feb 8 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM
Advertisement
Advertisement