'వారసత్వ నగరాలుగా అమరావతి, వరంగల్ '
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో వరంగల్ వారసత్వ నగరాలుగా గుర్తించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో వెంకయ్యనాయుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని.. ఆ బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలోని 12 నగరాలను వారసత్వ నగరాలుగా గుర్తించామని తెలిపారు. 2015, జనవరి నుంచి వారసత్వ పథకం అమలవుతుందని చెప్పారు.
పేదల గృహ నిర్మాణం కోసం రూ. 101 కోట్లు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. వరంగల్లో రూ. 70 కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే రామగుండంలో 17.75 కోట్లతో 280 ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో తమ ప్రభుత్వం లోక్సభలో అత్యధిక బిల్లు ప్రవేశపెట్టామని తెలిపారు. ఒక్క సెషన్లోనే 17 బిల్లులు ఆమోదం పొందిన సంగతిని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాజ్యసభలో మాత్రం 11 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. సభలో ప్రభుత్వానికి సహకరించాలని వెంకయ్యనాయుడు విపక్షాలకు సూచించారు.